కెయిర్న్ ఇండియా షేర్ల బైబ్యాక్

27 Nov, 2013 01:21 IST|Sakshi
కెయిర్న్ ఇండియా షేర్ల బైబ్యాక్

న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ ఆయిల్ దిగ్గజం  కెయిర్న్ ఇండియా రూ. 5,725 కోట్లతో సొంత షేర్లను కొనుగోలు(బైబ్యాక్) చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా ఎలాంటి నిధులూ ఖర్చుపెట్టకుండానే కెయిర్న్ ఇండియాలో ప్రమోటర్ కంపెనీ వేదాంతా గ్రూప్ వాటా పెరగనుంది. కెయిర్న్ ఇండియా వద్ద 300 కోట్ల డాలర్ల నగదు నిల్వలున్నాయి. దీంతో ఓపెన్ మార్కెట్ నుంచి 8.9% వాటాకు సమానమైన 17.09 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రణాళిక వేసింది.
 
 షేరుకి రూ. 335 గరిష్ట ధర
 షేరుకి గరిష్టంగా రూ. 335 ధరను చెల్లించనున్న బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత రెండు వారాల సగటు ధరతో పోలిస్తే బైబ్యాక్‌కు నిర్ణయించిన ధర 4% అధికమని కంపెనీ తెలిపింది. వాటాదారుల  అనుమతి పొందాక జనవరిలో బైబ్యాక్‌ను చేపట్టే అవకాశముంది. కాగా, బైబ్యాక్‌లో భాగంగా 10.27% వాటాను కలిగిఉన్న యూకే సంస్థ కెయిర్న్ ఎనర్జీ కొంతమేర వాటాను విక్రయించే అవకాశముంది. ఇది జరిగితే వే దాంతా గ్రూప్ వాటా ప్రస్తుతం 58.76% నుంచి 64.53%కు పెరుగుతుంది. ఇప్పటికే వేదాంతా గ్రూప్‌నకు మెజారిటీ వాటాను విక్రయించిన కెయిర్న్ ఎనర్జీ ప్రస్తుతం కెయిర్న్ ఇండియాలో 10.27% వాటాను కలిగి ఉంది. ఫలితంగా బైబ్యాక్‌లో మిగిలిన వాటాను విక్రయించడం ద్వారా కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగే అవకాశముంది. కెయిర్న్ ఇండియాలో కెయిర్న్ ఎనర్జీ వాటాను వేదాంతా షేరుకి రూ. 355 ధరలో కొనుగోలు చేసింది. కాగా, మంగళవారం బీఎస్‌ఈలో కెయిర్న్ ఇండియా షేరు 2.1% క్షీణించి రూ. 324 వద్ద ముగిసింది.
 
 బైబ్యాక్ వల్ల ఏమిటి లాభం?
సాధారణంగా కంపెనీలు తమ వద్ద నగదు నిల్వలను విస్తరణ ప్రణాళికలు, లేదా ఇతర కంపెనీల కొనుగోళ్లు వంటి కార్యకలాపాలకు వినియోగించే ఆలోచన లేనప్పుడు వాటాదారులకు లబ్ది చేకూర్చేందుకు వీలుగా బైబ్యాక్‌ను చేపడతాయి. తద్వారా మార్కెట్ ధర కంటే అధిక  ధరలో వాటాదారుల వద్ద నుంచి సొంత షేర్లను కొనడం ద్వారా నగదును వాటాదారులకు బదిలీ చేస్తాయి. అంతేకాకుండా బైబ్యాక్ వల్ల కంపెనీ ఈక్విటీ తగ్గి వార్షిక ఆర్జన(ఈపీఎస్) మెరుగుపడుతుంది. తద్వారా కంపెనీలో మిగిలిన వాటాదారులకు కూడా లబ్ది చేకూరుతుంది.  అయితే పూర్తిస్థాయిలో షేర్ల బైబ్యాక్‌ను చేపట్టాలనే నిబంధన లేకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు