మెదడులోని భావాలను మార్చవచ్చా?

16 Sep, 2016 22:57 IST|Sakshi
మెదడులోని భావాలను మార్చవచ్చా?

ఎడిన్‌బర్గ్: గుండు సూది తీసుకొని మన శరీరం మీద గుచ్చుకుంటే కించిత్తు బాధ కలుగుతుంది. ఓ నిమ్మకాయ ముక్క తీసుకొని నాలుకకు రాసుకుంటే పులుపు, వగరు కలిసిన రుచి మనకు తెలుస్తుంది. ఇది మన ఒక్కరికే కాదు. ఎవరికైనా కలిగేదే. శాస్త్రవేత్తలకు కూడా ఇది అనుభవమే. ఏదైనా వస్తువును మనం చూసినప్పుడు అది మనల్ని ఆకర్షించడానికి, ఆకర్షించకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ వస్తువు ఆకృతి, డైమెన్షన్లు, రంగును బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని రంగులను చూస్తే మనకు ఆహ్లాదకరంగా ఉంటాయి. కొన్ని రంగులను చూస్తే ఇబ్బందిగా ఉంటాయి. డా విన్చీ వేసిన ‘మోనాలిసా’ చిత్రాన్ని చూస్తే ప్రశాంతమైన భావం కలుగుతుంది. ఎడ్వర్డ్ మంచ్ వేసిన ‘ది స్క్రీమ్’ చిత్రాన్ని చూస్తే కాస్తా ఆందోళన కలుగుతుంది.

రంగులనుబట్టి మన మెదళ్లలో భావాలు మారుతాయని శాస్త్రవేత్తలు ఇదివరకే కనిపెట్టారు. నీలం, ఆకుపచ్చ రంగులు ప్రశాంతత కలిగిస్తే ఎరుపు రంగు ఆత్రుతను కలిగిస్తుంది. అందుకనే కోకకోలా క్యాన్స్, లిప్‌స్టిక్స్ ఎక్కువగా ఎరుపు రంగులోనే ఉంటాయి. అందరిలో ఒకే భావాలు కలుగుతాయా? అలా జరిగితే వారి మెదళ్లో కలిగే భావాలను మార్చవచ్చా? అన్న సందేహం స్కాట్‌ల్యాండ్‌లోని హెరైట్ వాట్ యూనివర్శిటీలో సీనియర్ రీసెర్చర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ జార్జి స్టిలియోస్‌కు కలిగింది. ఆయన వెంటనే తన పీహెచ్‌డీ స్టూడెంట్‌ను తీసుకొని ఈ అంశంపై ప్రయోగానికి దిగారు.

 ఆయన తన పరిశోధన కోసం 20 మందిని ఎంపిక చేసుకున్నారు. అలాగే 20 రకాల బొమ్మలను ఎంపిక చేసుకున్నారు. అందులో కొన్ని ఒకే డిజైనివికాగా, కొన్ని పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఒకే డిజైన్‌తో ఉన్నవి కూడా ఒకటి పలుచగా, మరొకటి మందంగా ఉండేలా చూసుకున్నరు.  రంగుల వల్ల భావాలు మారే అవకాశం ఉండడంతో నలుపు, తెలుపులో ఉండే డిజైన్లనే ఎన్నుకున్నారు. వాటిని పరిశోధనల్లో పాల్గొన్న 20 మందికి చూపించి, ఏ బొమ్మలు బాగున్నాయో గుర్తించి మదిలో కలిగిన భావాలను తెలియజేయమన్నారు. అప్పుడు వారి గుండె, మెదడులో కలిగే స్పందనలను ఈఈజీ, ఈసీజీల మానిటర్ల ద్వారా రికార్డు చేశారు. వారిలో 80 శాతం మందిలో గుండె, మెదడు స్పందనలు ఒకేరకంగా ఉండడమే కాకుండా వారు వ్యక్తం చేసిన భావాలు, అభిప్రాయాలు కూడా ఒకే కరంగా ఉన్నాయని తేల్చారు.

 రెండో ప్రయోగం కింద కంప్యూటర్‌లో ఓ వస్త్రాన్ని మొదటి ప్రయోగం తరహాలోనే  20 రకాలుగా తయారు చేసి వారికి చూపించారు. మొదటి ప్రయోగం తరహాలోనే ఇప్పుడు ఫలితాలు వచ్చాయి. 80 శాతం మంది ఒకే రకం అభిప్రాయలను, భావాలను వ్యక్తం చేయగా, మెదడులో ఏర్పడిన స్పందనలు కూడా ఒకేరకంగా ఉన్నాయి. ఆ తర్వాత వస్త్రం డిజైన్లను ఒకటి నుంచి రెండోదానికి, మూడు నుంచి నాలుగోదానికి, అటు నుంచి మళ్లీ మొదటికి ఇలా తారుమారు చేసి పలుసార్లు చూపించారు. అప్పుడు వారి అభిప్రాయాలు, భావాలు మారుతూ వచ్చాయి. ఏ భావాలు మెదడులో ఎక్కడ స్పందిస్తాయో అక్కడే స్పందనలు కనిపించాయి.

అందరిలో ఒకే రకమైన భావాలు కూకుండా వేరువేరుగా కనిపించాయి. దీనిర్థం మెదడులో కలిగే భావాలను కూడా మనం ప్రభావితం చేయవచ్చని ఈ ప్రయోగం ద్వారా తేలిందని ప్రొఫెసర్ జార్జి స్టిలియోస్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని మరోసారి రంగుల చిత్రాలతో చేసి ఓ నిర్ధారణకు వస్తామని ఆయన చెప్పారు. మానసిక ఒత్తిడి, స్కిజోఫ్రేనిక్ లాంటి జబ్బులను నయం చేయడానికి తమ పరిశోధనలు దోహదపడతాయని జార్జి అన్నారు. దృష్టి వైద్యం అని కూడా పిలవచ్చన్నారు.  అలాగే సైకోఆర్ట్, సైకోఆర్కిటెక్చర్, సైకోఇంటీరియర్ రంగాల అభివృద్ధికి బాటలు వేస్తుందని, చిత్రకళ బోధనకు కూడా ఓ అవగాహన ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు