పోటీ పరీక్షల అభ్యర్థులకు హైటెక్ శిక్షణ

25 Feb, 2016 01:03 IST|Sakshi
పోటీ పరీక్షల అభ్యర్థులకు హైటెక్ శిక్షణ

* వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల్లోని బీసీ స్టడీ సెంటర్లలో బోధన
* జిల్లా సమీక్షలు, పర్యవేక్షణకూ ఉపయోగం
* ఢిల్లీ, బెంగళూరులలో మెయిన్స్‌కు శిక్షణ

సాక్షి, హైదరాబాద్: వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు హైటెక్ శిక్షణ అందుబాటులోకి రానుంది. దీనికి బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. దీనివల్ల జిల్లాల్లోని అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది. మెరుగైన శిక్షణను అందించడం కోసం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్‌లో మెరుగైన  శిక్షణతోపాటు, నిపుణులు, సుశిక్షితులైన బోధకులు అందుబాటులో ఉంటున్నారు. అయితే జిల్లాల్లో నిపుణులైన అధ్యాపకుల కొరత కారణంగా పోటీపరీక్షల అభ్యర్థులకు ఇబ్బం దిగా మారుతోంది. వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని స్టడీ సర్కిళ్ల విద్యార్థులకు ఇది మరింత సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని స్టడీ సెంటర్‌లో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైనవారితో శిక్షణాతరగతులను నిర్వహించి, వాటిని వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా పది జిల్లాల్లో ప్రసారం చేసే విధంగా ఈ-స్కూల్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది.

ఆయా జిల్లాల్లోని స్టడీసర్కిళ్లలో దీని నిర్వహణకు అవసరమైన పరికరాల కోసం జిల్లాకు రూ.5.5 లక్షల చొప్పున మొత్తం రూ.55 లక్షలు అవసరమవుతాయని ప్రభుత్వానికి అంచనాలను సమర్పిం చింది. హెచ్‌డీ కెమెరా, మైక్, స్పీకర్లు, పెద్ద స్క్రీన్ టీవీ, బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీ, తదితరాలను ప్రతిపాదనల్లో పొందుపరిచారు. వెంటనే దీనిని మొదలుపెట్టాలని బీసీ శాఖ భావిస్తోంది.  దీనికి బీసీ, ఎస్టీ సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ తుదిరూపు ఇస్తున్నారు.

తరగతుల నిర్వహణ సందర్భంగా విద్యార్థులు తమ సందేహాలను తీర్చుకోవడంతోపాటు, లెక్చరర్లతో నేరుగా సంభాషించేందుకు అవకాశం ఉంటుందని, వారు నేరుగా తరగతిలో ఉన్నట్లుగా విద్యార్థులకు భావన కలగడం దీని ముఖ్యోద్దేశమని అధికారులు చెబుతున్నారు.అంతేకాకుండా వచ్చే విద్యాసంవత్సరం (2016-17) నుంచి ఎస్టీ, బీసీ ప్రీమెట్రిక్ హాస్టళ్లు, స్కూళ్లలో కూడా వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని అమలుచేస్తే ప్రాథమిక విద్యాస్థాయిలో కూడా మంచి ఫలితాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.  స్టడీసెంటర్లలో ఏర్పాటు చేసే వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని శాఖాపరంగా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చని బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదించింది.

జిల్లా స్థాయిల్లోని బీసీ ప్రీమెట్రిక్ స్కూళ్లు, హాస్టళ్లలోని స్థితిగతులు, పాఠ్యాంశాల బోధన, శాఖాపరమైన కార్యకలాపాల సమీక్షకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొంది. మరింత మెరుగ్గా సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా ఢిల్లీ, బెంగళూరులలో శిక్షణను అందించేలా బీసీ శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అభ్యర్థులకు అవసరమైన ఆర్థికసహాయాన్ని అందించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఇప్పటికే ఎస్సీ విద్యార్థులకు దీని అమలు ప్రారంభమై గత ఏడాది 250 మందికి, ఈ ఏడాది 300 మందికి మెయిన్స్ శిక్షణను అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు