మళ్లీ మారిన అభ్యర్థులు

19 Apr, 2016 03:15 IST|Sakshi
మళ్లీ మారిన అభ్యర్థులు

* ఏడోసారి అభ్యర్థుల మార్పు
* ముగ్గురు మంత్రులకు మళ్లీ అవకాశం
* అమ్మ నిర్ణయంతో ఆందోళన
* కంచిలో ఓట్ల వేట

సాక్షి, చెన్నై :  ఒకటోస్సారి...రెండోస్సారి అంటూ ఏడోస్సారి గా అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితా మారింది. ఎనిమి ది మందిని మార్చిన జయలలిత ముగ్గురు మంత్రులపై కరుణ చూపించారు. వారికి మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇక, సోమవారం కాంచీపురం జిల్లా వారణవాసి వేదికగా ఎన్నికల ప్రచారంలో  జయలలిత ఓట్ల వేట సాగించారు. మార్పు పర్వం సాగుతుండడంతో, అభ్యర్థుల్లో ఆందోళన బయలు దేరింది.
 
క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఈ సారి 234 స్థానాల్లో రెండాకుల చిహ్నంతో పోటీకి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థుల జాబితా ఏ ముహూర్తాన ప్రకటించారో ఏమోగానీ, మార్పుల పర్వం సాగుతూనే వస్తున్నది. ప్రతి ఎన్నికల్లోనూ ఇది జయలలితకు పరిపాటే అయినా, ఈ సారి మాత్రం ఈ మార్పులు అభ్యర్థుల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నది. ఫిర్యాదులు వెల్లువెత్తితే చాలు అభ్యర్థి మారినట్టే అన్న పరిస్థితి అన్నాడీఎంకేలో నెలకొని ఉండడం ఇందుకు కారణం. సీటు వచ్చిందన్న ఆనందంతో ప్రచారంలో దూసుకెళ్లడం  కన్నా, ఆ సీటును దక్కించుకునేందుకే అభ్యర్థులు తీవ్ర కుస్తీలు పడుతున్నారని చెప్పవచ్చు.

ఇందుకు తగ్గట్టుగా ఇప్పటికే ఆరు సార్లు అభ్యర్థుల్ని జయలలిత మార్చారు. నామినేషన్ల పర్వం ఆరంభం,  బీ ఫామ్‌లు చేతికి వచ్చే వరకు ప్రస్తుతం ప్రకటించిన  అభ్యర్థుల సీట్లకు గ్యార ంటీ లేదన్నది స్పష్టం కాక తప్పదు. ఒకటి, రెండు మూడూ అంటూ వేలం పాట తరహాలో ఏడోస్సారి..! అంటూ  అన్నాడీఎంకే అభ్యర్థుల మార్పు పర్వం చేరింది.
 
ఏడోస్సారి : ఒకే విడతగా 234 స్థానాలకు (ఏడుగురు మిత్రులతో కలిపి) ప్రకటించిన జాబితాల్లో పలువురు మంత్రుల్ని జయలలిత పక్కన పెట్టిన విషయం తెలిసిందే. అలాగే, కొందరు సీనియర్లకు సైతం చోటు కల్పించలేదు. ఎంపికలో  పొరబాటు జరిగిందా..? లేదా, ఆయా మంత్రులు, సీనియర్లకు పరీక్ష పెట్టేందుకు నిర్ణయించారో ఏమోగానీ, విస్మరించ బడ్డ వారందరికీ మళ్లీ చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్టు స్పష్టం అవుతోన్నది. ఇందుకు అద్దం పట్టే విధంగా అభ్యర్థుల మార్పు పర్వం సాగుతున్నది.

తాజాగా, సోమవారం జరిగిన మార్పుతో ముగ్గురు మంత్రులకు, ఒక మాజీ మంత్రికి చోటు కల్పించడం గమనార్హం. ఆ మేరకు ఎనిమది మంది అభ్యర్థుల్ని మార్చారు.  శంఖరాపురం నుంచి మంత్రి పి మోహన్, శ్రీ వైకుంఠం నుంచి మంత్రి ఎస్‌పి షణ్ముగనాథన్, పాపిరెడ్డి పట్టి నుంచి మంత్రి పళనియప్పన్‌లు పోటీకి  అవకాశం కల్పించారు. ఇక, మాజీ మంత్రి కేవి రామలింగం ఈరోడ్ పశ్చిమం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. తిరుచ్చి తూర్పు నుంచి నటరాజన్, ఎండీఎంకే నేత వైగోను ఢీ కొట్టేందుకు కోవిల్ పట్టి అభ్యర్థిగా కడంబూరు రాజ, పాళయం కోట్టైలో హైదర్ అలీ, అరక్కోణం నుంచి రవిలు పోటీ చేస్తారని ప్రకటించారు.

ఈ మార్పుల పర్వం ఎనిమిదోస్సారి, తొమ్మిదోస్సారి అని మరింతగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చిన ఫిర్యాదులు, ఆయా నియోజకవర్గాల్లో బలహీనం తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకుని  మరో 20 మందిని మార్చేందుకు తగ్గ కసరత్తులు జరుగుతున్న సమాచారంతో తదుపరి ఎవరో..! అన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొని ఉన్నది.
 
కంచిలో ఓట్ల వేట : చెన్నైలో  శ్రీకారం చుట్టి, విరుదాచలం, ధర్మపురి, అరుప్పుకోటైలలో సాగిన జయలలిత ఎన్నికల ప్రచార పర్యటన కాంచీపురానికి చేరింది. సోమవారం సాయంత్రం కాంచీపురం జిల్లా వారణ వాసిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జయలలిత ఓట్ల వేటలో పడ్డారు. కాంచీపురం, చెంగల్పట్టు తదితర 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను ఓటర్లకు  ఆమె పరిచయం చేశారు.

డీఎంకే ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై విరుచుకు పడ్డారు. సంపూర్ణ  మద్యనిషేధానికి  తొలి సంతకం అని కరుణానిధి గుప్పిస్తున్న హామీని నమ్మ వద్దని ఓటర్లకు సూచించారు. వరద ప్రళయం నుంచి కాంచీపురం, తిరువళ్లూరు, చెన్నై ప్రజల్ని రక్షించేందుకు తాము తీవ్ర చర్యలు చేపడితే, తమ మీదే నిందల్ని వేశారని మండిపడ్డారు. ప్రజల్ని మభ్య పెట్టి అధికారంలోకి వచ్చేందుకు కరుణానిధి ఆచరణలో పెట్టలేని హామీలు గుప్పిస్తున్నారని శివాలెత్తారు. ఈ హామీల్ని నమ్మి మోసపోవద్దని , తమకు మళ్లీ  అండగా నిలబడాలని ఓటర్లకు పిలుపు నిచ్చారు.  సంపూర్ణ మద్య నిషేధం ఒకే సారి అమలు సాధ్యం కాదు అని, దశల వారీగా మాత్రమే సాధ్యం అవుతుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు