ప్యాకేజీలతో ఆకాంక్షలను కొనలేరు: ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

12 Aug, 2013 01:02 IST|Sakshi
ప్యాకేజీలతో ఆకాంక్షలను కొనలేరు: ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోట్లాది మంది ప్రజల బలమైన ఆకాంక్షలను ప్యాకేజీలతో కొనలేరని వైఎస్సార్‌సీపీ నేత ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రూ.4 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తే సరిపోతుందంటూ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘సమైక్య రాష్ట్ర పరి రక్షణ సమితి’ ఆధ్వర్యంలో ఏపీఎన్జీవో కార్యాలయంలో ఆదివారం జరిగిన ‘సమైక్యవాదుల సమ్మేళనం’లో ఆయన మాట్లాడారు. సమైక్యవాదులది వెలకట్టలేని ఆకాంక్ష అని, ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీలు వ్యవహరించాలన్నది దిగ్విజయ్‌సింగ్‌తోసహా కాంగ్రెస్ పెద్దలు గ్రహించాలని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇందిరాగాంధీ బాధపడతారన్నారు. విదేశీ శక్తులతో అప్రమత్తంగా ఉండాలని ఆమె ఎప్పుడూ చెప్పేవారని, కానీ ఆమె ఇంట్లోనే ఇటలీ శక్తి తిష్టవేసిందన్నారు.  ఒక విభజన మరిన్ని రాష్ట్రాల విభజనలకు దారితీస్తుందని, తర్వాత దేశ విభజనకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
 
 రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సి.ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ.. ఆంటోనీ కమిటీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కమిటీకి ఉండే అధికారం ఏమిటని ప్రశ్నించారు.  తెలుగు మాట్లాడేవారందరిదీ ఒకే రాష్ట్రమని అర్థం వచ్చేలా తెలుగునాడు అనో, మహా తెలంగాణ అనో పెట్టి ఉంటే బాగుండేదన్నారు. విభజన వల్ల ఒకతరం పూర్తిగా నష్టపోతుందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. విభజనకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు, సమ్మెల వల్ల జరిగే నష్టంతో పోలిస్తే.. విభజన వల్ల జరిగే నష్టమే ఎక్కువని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో విభజనను అడ్డుకుంటామన్నారు. ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 15 తర్వాత హైదరాబాద్‌లో సభ పెడతామని, విజయవంతం చేయడానికి గట్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జన చైతన్య వేదిక చైర్మన్ లక్ష్మణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ‘సమైక్య’ అమరవీరులకు సభలో నివాళులు అర్పించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తమవంతు కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.
 

>
మరిన్ని వార్తలు