ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నం.. చపాతీ!

24 Jun, 2016 22:22 IST|Sakshi
ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నం.. చపాతీ!

గతమంతా చరిత్ర. కానీ, చరిత్ర అంతా పుస్తకాల్లోకి ఎక్కలేదు. అందుకే చరిత్రలోని కొన్ని సంఘటనలు నేటికీ ప్రపంచానికి తెలియరాలేదు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆందోళనకు గురి చేసే ఎన్నో ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. వాటన్నిటినీ చరిత్రకారులు గ్రంథస్థం చేశారు. ఒక్క చపాతీ ఉద్యమాన్ని తప్ప! అవును, భారతదేశాన్ని పాలించిన ఆంగ్లేయులను గోధుమ పిండితో తయారైన చపాతీలు ఒకప్పుడు తీవ్రంగా భయపెట్టాయి. తమ చుట్టూ ఏం జరుగుతోందో తెలియని అయోమయంలోకి నెట్టాయి..!
 
1857, మార్చి.. ఈస్టిండియా కంపెనీలో పనిచేసే మిలిటరీ వైద్యుడు డా.గిల్బర్ట్ హాడో బ్రిటన్‌లో ఉంటున్న తన సోదరికి ఓ లేఖ రాశాడు. ‘‘ఇక్కడేదో జరుగుతోంది. కానీ, అదేంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. సువిశాల భారతదేశం మొత్తం మీదా ఇదే జరుగుతోంది. ఇది ఉద్యమమో, రహస్య సమాజమో అర్థం కావడం లేదు. దీన్ని ఎవరు ప్రారంభించారో.. ఎందుకు, ఎక్కడ మొదలైందో కూడా ఎవరికీ తెలీదు. భారతీయ పత్రికల్లో దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని పేరు చపాతీ ఉద్యమం..!’’ అని భారతదేశంలోని అనుమానాస్పద వాతావరణాన్ని లేఖ రూపంలో ఆమెకు తెలియచేశాడు గిల్బర్ట్. ఒక్క గిల్బర్టే కాదు.. ఆనాటి బ్రిటిష్ అధికారులు, ఉద్యోగులు.. దాదాపు అందరూ ఇదే తరహా అనుభవాలను ఎదుర్కొన్నారు.


 చాప కింద నీరులా చల్లగా తన పనితాను చేసుకుపోతోన్న ‘చపాతీ’ ఉద్యమాన్ని చూసి భయాందోళనలు వ్యక్తం చేశారు. ఎవరికీ ఏ హానీ తలపెట్టని ఈ ఉద్యమం తొలిసారిగా బ్రిటిష్ అధికారుల దృష్టికి వచ్చింది మథురలో..! ఆ పట్టణానికి మెజిస్ట్రేట్‌గా పనిచేస్తోన్న మార్క్ థోర్న్‌హిల్ దీన్ని గుర్తించారు. ఆయన కార్యాలయంలో పనిచేసే ఓ వాచ్‌మన్ ఒకరోజు నాలుగు చపాతీలు పట్టుకుని వచ్చాడు. వాటిని థోర్న్‌హిల్‌కు చూపించి, ‘‘సార్! ఎవరో అడవి నుంచి వచ్చి నా చేతిలో ఈ చపాతీలు పెట్టారు. ఇలాంటివి మరిన్ని తయారు చేసి పొరుగూరిలో పంచమన్నారు. నేను మరిన్ని వివరాలు అడిగేలోగా తిరిగి అడవిలోకి వెళ్లిపోయారు..’’ అంటూ వివరించాడు.


దీంతో థోర్న్‌హిల్‌లో అనుమానం మొదలైంది. గుర్తుతెలియని వ్యక్తులు చపాతీలు ఎందుకు పంచమంటున్నారు..? అని లోలోపలే ప్రశ్నలు వేసుకున్నాడు. వెంటనే ఆలస్యం చెయ్యకుండా విచారణకు ఆదేశించాడు. అలా కొద్ది రోజుల పాటు పట్టణంలో రాత్రి పూట ఏం జరుగుతోందో తెలుసుకున్నాడు. ఎవరో ఎక్కడి నుంచో వస్తున్నారు. చపాతీలు పంచుతున్నారు. మరిన్ని చపాతీలు తయారు చేసి పక్కవారికి పంచమని సందేశాలు ఇస్తున్నారు. ఇదే విషయాన్ని పై అధికారులకు నివేదించాడు థోర్న్‌హిల్. వారు కూడా విచారణలు జరిపారు.

ఈ క్రమంలో బట్టబయలైన సమాచారం వారికి నిద్రపట్టనివ్వలేదు. భారతదేశమంతా ఈ తంతు జరుగుతున్నట్టు గుర్తించారు. ఒక్క రాత్రిలోనే దాదాపు 300 కిలోమీటర్ల దూరం చపాతీలు ప్రయాణిస్తున్నాయని తెలుసుకుని ఉలిక్కిపడ్డారు. తమ పోస్టల్ సర్వీసు కూడా అంత వేగంగా సమాచారం బట్వాడా చేయలేకపోతోందని గ్రహించారు. మనుషులే గొలుసులుగా ఏర్పడి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి ఒకే రాత్రిలో చపాతీలు చేరవేయడం మామూలు విషయం కాదు కదా!

ఇదే బ్రిటిష్‌వారిలో లేనిపోని భయాలను సృష్టించింది. చపాతీలు మాత్రమే కాకుండా.. దాంతో పాటే మరేదో రహస్య సమాచారం కూడా బట్వాడా అవుతోందని వారు భావించారు. తమ పోలీసు వ్యవస్థ సహాయంతో ఎందరినో ప్రశ్నించారు. కానీ, ఎవరికీ తాము ఎందుకు చపాతీలు పంచుతున్నామో, ఎవరికోసం పంచుతున్నామో కూడా స్పష్టత లేదు. అలాగని, చపాతీలపై ఎలాంటి రహస్య సమాచారం గానీ, కోడ్‌లు గానీ లేవు.

1857 నాటికి తమ పాలనపై భారతీయుల్లో అసంతృప్తి ఉందన్న సంగతి బ్రిటిషర్లకు తెలుసు. ఇది ఉద్యమంగా మారనుందా..? చపాతీల సాయంతో భారతదేశం నలుమూలలా బ్రిటిష్ వ్యతిరేక భావజాలం పాకుతోందా..? వారికి అర్థం కాలేదు. అదే జరిగితే 25 కోట్ల మంది భారతీయులను తమ లక్షమంది సైన్యం నిలువరించలేదు. ఓ రకంగా చెప్పాలంటే.. ఇదో మానసిక యుద్ధంలా మారిపోయింది. చపాతీలు దేన్నో మోసుకెళ్తున్నాయని వారు విశ్వసించారు. కొందరు అధికారులు ఇవి తూర్పున ఉన్న కలకత్తా నుంచి వస్తున్నాయని, మరికొందరు ఉత్తర భారతదేశంలోని అవధ్ నుంచి బయలుదేరుతున్నాయని, ఇంకొందరేమో మధ్య భారతదేశానికి చెందిన ఇండోర్ నగరమే వీటికి జన్మస్థలమనీ.. ఇలా రకరకాలుగా తీర్మానించేశారు.

చివరకు ఎలాగో ఆ ఏడాది గడిచేసరికి చపాతీ ఉద్యమం పూర్తిగా చల్లబడిపోయింది. బ్రిటిష్ చరిత్రకారులకు మాత్రం ఆ ఉద్యమ కారణాలు నేటికీ స్పష్టంగా తెలియరాలేదు. ఆంగ్లేయులు భయపడినట్టుగా అవి స్వతంత్ర సాధన కోసం కాదని, కలరా బాధితులను ఆదుకునేందుకే ఎవరో మొదలు పెట్టిఉంటారని కొందరి రచయితల భావన. ఈ ‘చపాతీ ఉద్యమం’ ఎందుకు, ఎక్కడ, ఎలా పురుడుపోసుకుందో పక్కనబెడితే.. బ్రిటిష్‌వారికి ముచ్చెమటలు పట్టించడం మాత్రం గొప్ప విషయమే..!





మరిన్ని వార్తలు