రాజధానా? వ్యాపారమా?

24 Aug, 2015 03:16 IST|Sakshi
రాజధానా? వ్యాపారమా?

సాక్షి, గుంటూరు: పాలకులు రాజధాని కడుతున్నారా? లేక రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా? అంటూ జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్‌కల్యాణ్ ఎదుట రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం, అధికారులు మారిపోతే తమకు ఇచ్చిన హామీలను ఎవరు నెరవేరుస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చట్టం కింద నోటిఫికేషన్ ఇవ్వడంతో పవన్‌కల్యాణ్ ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాక గ్రామంలో ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, బేతపూడి, నవులూరు, నిడమర్రు, కురగల్లు గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

భూసేకరణ కింద రాజధానికి భూములు ఇచ్చేందుకు మీకున్న అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు. తమను భయభ్రాంతులకు గురిచేసి భూములు తీసుకున్నారని రైతులు చెప్పారు. ఎక్కువ మంది స్వచ్ఛందంగా ఇవ్వలేదని తెలిపారు. 29 గ్రామాల్లో ఓపెన్‌బ్యాలెట్ పెడితే అసలు విషయం బయటపడుతుందన్నారు. పవన్‌కల్యాణ్ రాక కోసం ఉదయం నుంచి ఎదురుచూసిన అభిమానులు ఆయన మాట్లాడుతున్న సమయంలో బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వచ్చారు. ఇదే సమయంలో విలేకరులపై రాళ్లు రువ్వారు. ఒక రాయి పవన్ పక్కనే పడింది. దీంతో పోలీసులు వారిపై స్వల్పంగా లాఠీచార్జి చేశారు.

మరిన్ని వార్తలు