6 నెలల్లో మరిన్ని సంస్కరణలు

30 Nov, 2013 02:00 IST|Sakshi
6 నెలల్లో మరిన్ని సంస్కరణలు

 న్యూఢిల్లీ: దేశం మళ్లీ అధిక వృద్ధిబాట పట్టే దిశగా వచ్చే ఆరు నెలల్లో క్యాపిటల్ మార్కెట్లు, ఆర్థిక రంగంలో మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలిపారు. వచ్చే ఏడాది వృద్ధి రేటు 6 శాతానికి పెరగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను సరళీకరించడం, ప్రాజెక్టులకు ఆటంకాలను తొలగించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆర్థిక అంశాలపై శుక్రవారం జరిగిన ఒక సదస్సులో చిదంబరం తెలిపారు. ‘నేను చేయాల్సిన పనులకు సంబంధించి పెద్ద చిట్టా ఉంది. దాన్ని రోజూ ఫాలో చేస్తుంటాను. క్యాపిటల్ మార్కెట్లను, ఆర్థిక రంగాన్ని సరళీకరించాలి.. గ్యాస్, చమురు ధరల సమస్యలను పరిష్కరించాలి. మరింత బొగ్గు ఉత్పత్తి చేసే దిశగా బొగ్గు రంగంలో కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాం. నిల్చిపోయిన ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పెట్టుబడుల క్యాబినెట్ కమిటీ మరిన్ని సార్లు భేటీ కానుంది. ఇలా చేయాల్సినవి చాలా ఉన్నాయి.. వీటన్నింటినీ కచ్చితంగా చేస్తాం’ అంటూ ఆయన వివరించారు.
 
 ఒత్తిడి అధిగమించ గలం..
 ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల తరహాలోనే భారత ఎకానమీ కూడా ఒత్తిడిలో ఉందని, అయితే దీన్ని కచ్చితంగా అధిగమించగలమని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. 2014-15లో వృద్ధి రేటు 6 శాతానికి చేరువలో ఉండగలదని, రెండేళ్ల వ్యవధిలో మరింత మెరుగుపడి 8 శాతానికి పెరగగలదని పేర్కొన్నారు. 2012-13లో ఎకానమీ వృద్ధి పదేళ్ల కనిష్టమైన 5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ వృద్ధి..నాలుగేళ్ల కనిష్టమైన 4.4 శాతంగా ఉండటాన్ని ప్రస్తావించిన చిదంబరం ఇది నిరాశపర్చిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తప్పటడుగులు వేయకుండా ఆర్థిక క్రమశిక్షణ బాటలో ముందుకు సాగాల్సి ఉంటుందని చిదంబరం చెప్పారు. పెట్టుబడులపై నిర్ణయాలను వేగవంతం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అధిక వృద్ధికి బాటలు వేయగలవని పేర్కొన్నారు. భారత్‌పై ఇన్వెస్టర్ల అభిప్రాయం క్రమంగా మారుతోందన్నారు.
 
 పరిశ్రమ వర్గాలు ఓపిక పట్టాలి..
 ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం చివరి రోజు వరకూ పాటుపడతామని చిదంబరం చెప్పారు. సరైన నిర్ణయం తీసుకున్నామా లేదా అన్నది ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలుస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ఫలితాలను చూసే దాకా పరిశ్రమ వర్గాలు ఓపిక పట్టాలని  పేర్కొన్నారు.
 
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు