త్వరలో రేషన్‌ నగదు రహితం!

7 Feb, 2017 17:18 IST|Sakshi

న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. క్రెడిట్, డెబిట్‌ కార్డులతో పాటు ఆధార్‌ ద్వారా చెల్లింపులకు అన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)లు, ఎరువుల దుకాణాల్లో త్వరలో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే 1.7 లక్షల పీఓఎస్‌లు పీడీఎస్‌ల్లో అమర్చామని, కొద్ది నెలల్లో మిగిలిన అన్ని దుకాణాల్లో అందుబాటులోకి తెస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్‌ లవసా తెలిపారు.

‘ఆహార– ప్రజా పంపిణీ, ఎరువుల విభాగాల వద్ద పీఓఎస్‌లను ఇన్‌స్టాల్‌ చేయడానికి అవసరమైన ప్రోగ్రామ్‌ ఉంది. వాటిల్లో ఆధార్‌ ద్వారా కూడా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకొంటాం. లక్ష గ్రామాల్లో రెండేసి మిషన్ల చొప్పున ఏర్పాటు కోసం ఆర్థిక సహకారం అందించేందుకు నాబార్డు ముందుకు వచ్చింది’ అని అశోక్‌ చెప్పారు. డిజిటల్‌ చెల్లింపుల ద్వారా లాభమెంతన్నది అంచనాకు రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టవచ్చని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

మరిన్ని వార్తలు