మీ పర్సుకు రక్షణ ఉందా..?

28 Mar, 2016 00:10 IST|Sakshi
మీ పర్సుకు రక్షణ ఉందా..?

కార్డు మోసాలకు సైతం బీమా కవరేజీ  వినూత్న ఫీచర్లతో కార్డు ప్రొటెక్షన్ ప్లాన్లు వ్యాలెట్ పోగొట్టుకున్నా అప్పటికప్పుడు సాయం
కార్డుల బ్లాకింగ్ నుంచి బీమా కవరేజీ దాకా అన్నీ చూసుకుంటామంటున్న ‘రక్షణ’ సంస్థలు విజయ్‌కి రెండు క్రెడిట్ కార్డులున్నాయి. తరచు టూర్లకు వెళుతుంటాడు. ఈ మధ్య మలేసియా వెళ్లినపుడు క్రెడిట్ కార్డు వాడాడు. తను కార్డుపై వాడింది 1000 రింగెట్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.17,000. కానీ ఆ నెల బిల్లు చూసి కళ్లు తిరిగాయి. రూ.90 వేలకు బిల్లు వచ్చింది. విజయ్‌కి ఏమీ పాలుపోలేదు. తీరా క్రెడిట్ కార్డు సంస్థకు, పోలీసులకు ఫిర్యాదు చేశాక... దర్యాప్తు జరిగాక ఆలస్యంగా తెలిసిందేమిటంటే... ఆయన కార్డును అక్కడ ఎవరో క్లోన్ చేశారు. దాని సాయంతో అక్కడే ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించారు. విజయ్‌ని లూటీ చేశారు.


సురేష్‌ది మరో కథ... తనకు రెండు క్రెడిట్ కార్డులు, రెండు డెబిట్ కార్డులు ఉన్నాయి. తరచు ట్రావెల్ చేస్తుంటాడు. ఈ మధ్య రాజస్తాన్ వెళ్లినపుడు అక్కడ కోటలు, పర్యాటక ప్రాంతాలు చూస్తుండగా పర్సు పోగొట్టుకున్నాడు. ఆ వ్యాలెట్‌లోనే కార్డులతో పాటు డ్రైవింగ్ లెసైన్స్, పాన్ కార్డు అన్నీ ఉన్నాయి. లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటమే కాక... కార్డు జారీ చేసిన బ్యాంకులకు ఒక్కొక్కదానికీ ఫోన్ చేసి దాన్ని బ్లాక్ చేయించాడు. మళ్లీ లెసైన్సు, పాన్ కార్డు కోసం పాట్లు పడుతున్నాడు.

 

విజయ్, సురేష్ లాంటి సంఘటనలు చాలామందికి జరుగుతుంటాయి. వీటిని నివారించటం సులువేమీ కాదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటివి జరిగే ఆస్కారం ఉంది. మరి దారేంటి? ఇదిగో... ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే కార్డు రక్షణ సంస్థలు. ఒన్ అసిస్ట్, సీపీపీ ఇండియా వంటి సంస్థలతో పాటు టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కూడా కార్డు రక్షణ ప్లాన్లను అందిస్తున్నాయి. వీటిని తీసుకుంటే పలు మోసాల నుంచి రక్షణ పొందొచ్చు. ఎందుకంటే కార్డుదారు మోసానికి గురైతే కంపెనీ తన బాధ్యత లేదంటుంది. దీనిపై కోర్టులోనో, అంబుడ్స్‌మన్ వద్దో ఫిర్యాదు చేసి దీర్ఘకాలం పోరాడాలి. మోసానికి కారణం తన నిర్లక్ష్యం కాదని నిరూపించుకోవాలి. అదే కార్డు రక్షణ ప్లాన్ ఉంటే... ఆ మోసం కార్డుదారు నిర్లక్ష్యం వల్లే జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత కంపెనీపై పడుతుంది. అదీ కథ.  - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం

 

ఈ పథకాలు ఎలా పనిచేస్తాయంటే...
ఒన్ అసిస్ట్ సంస్థ ‘వ్యాలెట్ అసిస్ట్’ను... సీపీపీ ఇండియా ‘ప్రొటెక్షన్ ప్లాన్’ను అందిస్తున్నాయి. ఇవి రెండూ ఒకలాంటివే. వినియోగదారు వీటి సభ్యత్వం తీసుకున్నాక తన వద్ద ఉన్న కార్డులన్నిటినీ వీటిలో నమోదు చేయాలి. మోసం జరిగినపుడు బీమా కవరేజీతో పాటు... వ్యాలెట్ పోతే అయ్యే ఖర్చులు కూడా ఈ ప్లాన్లతో తిరిగొస్తాయి. కార్డును పోగొట్టుకున్నా, మోసం జరిగినట్లు గుర్తించినా వీటి కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే చాలు. వాళ్లు బ్యాంకులతో మాట్లాడి అన్ని కార్డులూ బ్లాక్ చేస్తారు.

 

ఇవీ లాభాలు...
నగరాల్లో చాలామందికి కనీసం ఒక క్రెడిట్ కార్డు, రెండు డెబిట్ కార్డులు ఉంటాయి. మోసం జరిగినా, వ్యాలెట్ పోయినా... వారు ప్రతి బ్యాంకుకూ వ్యకిగతంగా ఫోన్ చెయ్యాలి. వెరిఫికేషన్ ఉంటుంది. అదయ్యాక కార్డు బ్లాక్ చెయ్యమని చెప్పాలి. అదంతా పెద్ద తతంగం. కార్డ్ ప్రొటెక్షన్ తీసుకుంటే... కస్టమర్ తరఫున ఈ కంపెనీలే బ్యాంకుకు ఫోన్ చేసి అవన్నీ చూసుకుంటాయి.


మనం మోసానికి గురయ్యామని వెంటనే తెలియకపోవచ్చు. తెలిసేసరికి కొన్ని రోజులు పట్టొచ్చు. అప్పుడు ఫిర్యాదు చేస్తాం. అందుకే వ్యాలెట్ అసిస్ట్, కార్డ్ ప్రొటెక్షన్‌లు... ఫిర్యాదు చేయడానికి చాలా రోజుల ముందు జరిగిన మోసాలకు కూడా కవరేజీ ఇస్తున్నాయి. నేరాల రక్షణకు సంబంధించి ఇవి బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాయి. క్లెయిమ్ చెయ్యడానికి కార్డుదారు ఫారాన్ని నింపి, ఎఫ్‌ఐఆర్‌ను జత చేసి, ఇతర డాక్యుమెంట్లతో కలిపి అందజేయాలి. బీమా కంపెనీ దర్యాప్తు జరిపి, వెరిఫికేషన్ పూర్తయ్యాక క్లెయిమ్ సొమ్మును అందజేస్తుంది. టాటా ఏఐజీ... ఇది పలు కార్డు కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. కవరేజీ, ప్లాను, ప్రీమియం ఇవన్నీ అవసరానికి తగ్గట్టు మారుస్తారు. కంపెనీ మొత్తం 4 వ్యక్తిగత ప్లాన్లను అందజేస్తోంది. వీటిని విడివిడిగా, లేదా కలిపి తీసుకోవచ్చు. వివరాలు చోరీకి గురైనా... కార్డులపై మోసపూరితంగా ఛార్జీలు వేసినా... ఏటీఎంలో దాడికి గురైనా... దొంగతనానికి గురైనా... వ్యాలెట్‌ను పోగొట్టుకున్నా ఈ కవరేజీ పొందొచ్చు.
 

 
అదనపు లాభాలెన్నో...
నిజానికి ఒన్ అసిస్ట్, సీపీపీ సంస్థల ప్లాన్లలో కవరేజీ కన్నా ముఖ్యమైనది వ్యాలెట్ పోగొట్టుకున్నపుడు వారందించే సాయం. ‘‘మా కస్టమరు వ్యాలెట్ పోగొట్టుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా తనకు అత్యవసర హోటల్, ట్రావెల్ సహాయం అందిస్తాం. దీనికోసం ట్రావెల్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నాం. వ్యాలెట్ పోయి డబ్బులు లేకపోతే కార్డుదారుకు వడ్డీలేని నగదు అందిస్తాం. హోట ల్ బిల్లులు చెల్లించటమే కాక విమాన టిక్కెట్లు ఏర్పాటు చేస్తాం’’ అని సీపీపీ ఇండియా కంట్రీ మేనేజరు దీపక్ మతాయ్ చెప్పారు. ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షించేందుకు సీపీపీ ఏడాదిపాటు ఉచిత ఎఫ్‌సెక్యూర్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది. పాన్‌కార్డు పోతే కొత్తది తెప్పిస్తోంది. వ్యాలెట్ అసిస్ట్ అయితే ఫారెక్స్ కార్డులకూ కవరేజీ ఇస్తోంది. డ్రైవింగ్ లెసైన్స్ పోతే తిరిగి తెప్పిస్తోంది.

 

అన్ని మోసాలకూ కవరేజీ ఉండదు...! సీపీపీ
ఈ కార్డ్ ప్రొటెక్షన్ పథకాలేవీ ఇంటర్నెట్ లేదా ఫోన్ బ్యాంకింగ్ మోసాలకు పనికిరావు. కార్డు విషయానికొచ్చినా అన్ని రకాల మోసాలకూ ఈ కవరేజీ ఉండదు. కార్డుదారు నిర్లక్ష్యం వల్ల గనక మోసం జరిగితే క్లెయిము తిరస్కరణకు గురవుతుంది. నేరగాళ్లు కార్డుదార్లకు ఫోన్ చేసి... వారి ద్వారానే ఓటీపీ వంటి వివరాలు తెలుసుకుని మోసపూరిత లావాదేవీలు చేస్తుంటారు. ఇలాంటి విషింగ్ మోసాలకు సంబంధించిన క్లెయిముల్ని తిరస్కరిస్తారు. ‘‘కస్టమర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతాయి కనక మొదట్లో విషింగ్ మోసాలకు సంబంధించిన క్లెయిములన్నీ తిరస్కరణకు గురయ్యేవి. ఇపుడు కొన్ని రకాలైన విషింగ్ మోసాలకు సంబంధించి మా భాగస్వామ్య సంస్థలు క్లెయిములు అంగీకరిస్తున్నాయి. అంతిమంగా క్లెయిముపై నిర్ణయం బీమా కంపెనీదే’’ అని మతాయ్ వివరించారు.

 

ఒన్ అసిస్ట్
ఏఏ రకాల మోసపూరిత లావాదేవీలు కవరేజీ పరిధిలోకి వస్తాయో జాబితా రూపొందించింది. కార్డు పోగొట్టుకున్నాక దానిపై జరిగే లావాదేవీలు... కార్డుల్ని మరో వ్యక్తి మోసపూరితంగా ఉపయోగించి చేసే ఆన్‌లైన్ లావాదేవీలు... చిప్‌లేని కార్డుల్ని ఏటీఎంలలో ఉపయోగించినా, స్వైపింగ్ చేసినా... ఈమెయిల్, ఫోన్‌కాల్స్, కార్డు వివరాలను కాపీచేయటం వంటి మార్గాల్లో నేరగాళ్లు గనక సమాచారం తస్కరించినా... ఇవన్నీ కవరేజీ పరిధిలోకి వస్తాయి. బ్లాక్ చేసిన తరవాత గనక కార్డును విని యోగిస్తే దానికి బ్యాంకు బాధ్యత వహించాల్సి ఉంటుంది కనక అది కవరేజీ పరిధిలోకి రాదు.

 


ఏఐజీ..
టాటా కార్డు లేదా వ్యాలెట్ పోయినట్లు ఫిర్యాదు చేయటానికి 48 గంటల ముందు జరిగిన లావాదేవీలు, విత్‌డ్రాయల్స్‌కు మాత్రమే కవరేజీ ఇస్తోంది. కొన్ని కవరేజీల్లో కొంత సొమ్ము మినహాయిస్తోంది కూడా. ఉదాహరణకు కార్డు పోతే... దానికి రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుంది. ‘‘దీనివల్ల చిన్న చిన్న చిన్నవాటికి కూడా క్లెయిము చేయటమనేది తగ్గుతుంది. కార్డుదారుకు నిజంగా బాధ కలిగించే లావాదేవీల్ని కవర్ చేయటమే ఈ బీమా ఉద్దేశం’’ అని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.
 

 
తరచు ప్రయాణాలు చేసేవారికైతే బెటర్...

ఎవరికైనా వివిధ బ్యాంకులు జారీ చేసిన... మూడు కన్నా ఎక్కువ కార్డులుంటే ఇలాంటి ప్లాన్‌లు ఎంచుకోవటం మంచిది. తరచు విదేశాలకు ప్రయాణించేవారికైతే ఇది అవసరం ఎంతో కూడా. ఎందుకంటే కార్డుల క్లోనింగ్, స్కిమ్మింగ్ అనేవి పలు దేశాల్లో సాధారణమైపోయాయి. దీంతో పాటు విదేశాల్లో మీరు గనక మీ వ్యాలెట్ పోగొట్టుకుంటే... అన్ని కార్డుల్నీ ఒకేసారి ఒకే కాల్‌తో బ్లాక్ చేయటం సాధ్యమవుతుంది.

 

మరిన్ని వార్తలు