బీఎండబ్ల్యూ రికార్డు అమ్మకాలు

14 Jan, 2014 01:22 IST|Sakshi

 ఫ్రాంక్‌ఫర్ట్: లగ్జరీ కార్ల విభాగంలో జర్మనీ దిగ్గజం బీఎండబ్ల్యూ గతేడాది రికార్డు అమ్మకాలు సాధించింది. తమ దేశానికే చెందిన  ఆడి, మెర్సిడెస్ బెంజ్‌ను తోసిరాజని అగ్రస్థానం దక్కించుకుంది. 2013లో బీఎండబ్ల్యూ బ్రాండ్ కింద 16.6 లక్షల కార్లను విక్రయించినట్లు సంస్థ తెలిపింది. తద్వారా అంతక్రితం ఏడాదితో పోలిస్తే 7.5% వృద్ధి సాధించినట్లు పేర్కొంది. ఇటీవలి గణాంకాల ప్రకారం ఆడి గతేడాది 15.7 లక్షలు, మెర్సిడెస్ బెంజ్ 14.6 లక్షల కార్లను విక్రయించాయి. చైనా, అమెరికా లో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో ఈ కంపెనీలు మెరుగైన ఫలితాలు సాధించ గలిగాయి. జర్మనీ ఆటోమొబైల్ రంగంలో ఈ మూడు దిగ్గజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. బీఎండబ్ల్యూలో భాగమైన సూపర్ లగ్జరీ రోల్స్ రాయిస్ కార్ల అమ్మకాలు 1.5 శాతం పెరిగి 3,630గా నమోదయ్యాయి. రోల్స్ రాయిస్ బ్రాండ్ కింద కొన్నాళ్ల క్రితం ప్రవేశపెట్టిన రెయిత్ మోడల్ ఇందుకు తోడ్పడింది.
 

మరిన్ని వార్తలు