లలిత్ మోదీ కేసులో ఇంటర్ పోల్ తకరారు

15 Dec, 2015 10:30 IST|Sakshi
లలిత్ మోదీ కేసులో ఇంటర్ పోల్ తకరారు

ముంబై/లిస్బన్: లలిత్ గేట్ కుంభకోణంలో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్ పోల్ మరో తకరారుకు తెరలేపింది. ఐపీఎల్ ప్రసార హక్కుల కుంభకోణం వ్యవహారంలో లలిత్ మోదీ నిజంగానే అక్రమాలకు పాల్పడ్డారా? లేక ఉద్దేశపూర్వకంగా ఇరికించారా? మీరు మోపిన అభియోగాల్లో వాస్తవం ఎంత? ఆమేరకు ఆధారాలున్నాయా? వంటి ప్రశ్నలు సంధిస్తూ వారంలోగా సమాధానాలు చెప్పాలని ఇంటర్ పోల్ సీబీఐని కోరింది.

తీవ్రమైన ఆర్థిక నేరానికి పాల్పడ్డారనే ఆరోపణు ఎదుర్కొంటూ, ప్రస్తుతం విదేశం(పోర్చుగల్)లో నివసిస్తున్న లలిత్ మోదీపై ఈడీ గత ఆగస్టులో రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది. దీంతో ఈ కేసులోకి ఇంటర్ పోల్ రంగప్రవేశం చేసింది. కాగా, ఒక కేంద్ర మంత్రి సహా కొందరు బీసీసీఐ పెద్దలు ఉద్దేశపూర్వకంగా తనను టార్గెట్ చేశారని, ఈడీ ఆరోపణల ఆధారంగా తనకు నోటీసులు జారీచెయ్యొద్దంటూ లలిత్ మోదీ ఇంటర్ పోల్ను కోరాడు.  అతని అప్పీలును పరిశీలించిన ఇంటర్ పోల్.. కేసు ప్రేరితమా? కాదా? అంటూ మౌలిక ప్రశ్నలు లేవనెత్తింది. లలిత్ మోదీ అప్పీళ్లపై వచ్చేవారం విచారణ జరగనున్నందున ఆలోపే సమాధానాలు పంపాలని ఇంటర్ పోల్ కోరింది.

'సాధారణంగా తాను దర్యాప్తు చేసే కేసుల వివరాలను ఈడీ.. భారతీయ కోర్టులకు తప్ప ఇతర అంతర్జాతీయ సంస్థలకు వెల్లడించదు. అలాంటిది పదేపదే వివరాలు తెలపాలంటూ ఇంటర్ పోల్ ఈడీని కోరుతోంది. లలిత్ మోదీ ఏదో ఒక ఇష్యూను ఇంటర్ పోల్ ముందుంచడం, వాటికి సమాధానాలివ్వాలంటూ ఇంటర్ పోల్, ఈడీని ప్రశ్నిస్తోంది. మొత్తంగా ఇదేదో కోర్టు విచారణ ఉందేకాని, దర్యాప్తుల సాగటంలేదు'అని ఈడీ సీనియర్ అధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.


వాస్తవానికి లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్)నే అయినప్పటికీ, భారత్లో ఇంటర్ పోల్ కు సీబీఐ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నందున ఆ సంస్థ ద్వారానే ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ఈమేరకు ఈడీ నుంచి సమాచారం సేకరించి పంపాలని  ఇంటర్ పోల్ సీబీఐని కోరింది.

మరిన్ని వార్తలు