బ్రేకింగ్‌: డ్రగ్స్‌ కేసు.. వర్మపై కోర్టులో పిటిషన్‌

25 Jul, 2017 16:36 IST|Sakshi
డ్రగ్స్‌ కేసు.. వర్మపై కోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: సంచలనం రేపిన డ్రగ్స్‌ మాఫియా కేసులో ఎక్సైజ్‌శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సినీ పరిశ్రమను టార్గెట్‌ చేసి వేధిస్తున్నారని, ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ బాహుబలిలా మీడియాకు కనిపిస్తున్నారని వర్మ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వర్మ వ్యాఖ్యలను తప్పుబడుతూ న్యాయవాది రంగప్రసాద్‌ రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌ వేశారు. సంచలనం రేపుతున్న డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌శాఖ విచారణకు ఆటంకం కలిగించేలా వర్మ వ్యాఖ్యలు చేశారని, ఇలా వ్యాఖ్యలు చేయడం శిక్షార్హమేనని రంగప్రసాద్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
 
డ్రగ్స్‌ కేసుతో వర్మకు సంబంధం లేదని, అయినా ఎక్సైజ్ అధికారులను కించపరిచేవిధంగా, వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వర్మ వ్యాఖ్యలు చేశారని రంగప్రసాద్‌ తెలిపారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించేవిధంగా వ్యవహరించడం, వ్యాఖ్యలు చేయడం ఐపీసీ సెక్షన్‌ 343 ప్రకారం చట్టవిరుద్ధమని, ఇలా ప్రవర్తించినందుకు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు కూడా జైలుశిక్ష పడే అవకాశముందని ఆయన చెప్పారు.

సినీ ప్రముఖుల తరహాలోనే డ్రగ్స్‌ తీసుకున్న స్కూలు పిల్లలను కూడా పిలిచి గంటలు గంటలు విచారిస్తారా? అని వర్మ ప్రశ్నించడం తగదని, దేశంలో మైనర్లు, మేజర్లకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని రంగప్రసాద్‌ అన్నారు. ఎక్సైజ్‌శాఖను అవమానపరిచేవిధంగా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని, పోలీసు, ఎక్సైజ్‌శాఖలపై ప్రజల్లో గౌరవముందని, దానిని దెబ్బతీయడం సరికాదని చెప్పారు.

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ను అమరేంద్ర బాహుబలిలా మీడియా చూపిస్తున్నదంటూ ఆయన విపరీత వ్యాఖ్యలు చేశారు. 'సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజులను 12 గంటలపాటు ప్రశ్నించినట్టుగానే డ్రగ్స్‌ తీసుకున్న స్కూల్‌ విద్యార్థులను కూడా గంటల తరబడి ప్రశ్నిస్తారా?' అని నిలదీశారు.
 

మరిన్ని వార్తలు