కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగించాలి

1 Aug, 2015 03:43 IST|Sakshi
కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగించాలి

రిషితేశ్వరి తల్లిదండ్రుల డిమాండ్
వర్సిటీ తెరిచిన తర్వాత విచారణ కొనసాగించాలి
ఏపీ సీఎం చంద్రబాబుతో  దుర్గాబాయి, మురళీకృష్ణ భేటీ

 
విజయవాడ బ్యూరో:  రిషితేశ్వరి కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగించడం ద్వారా వీలైనంత త్వరగా విచారణ పూర్తయ్యేలా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లిదండ్రులు దుర్గాబాయి, మురళీకృష్ణ డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి సెలవులు ఇచ్చి విచారణ చేస్తే చాలామంది విద్యార్థులు అందుబాటులో లేక అసలు విషయాలు తెలియవని, అందువల్ల వర్సిటీ తెరిచిన తర్వాత విచారణ కొనసాగించాలని కోరారు. ఈ కేసు ఏళ్ల తరబడి సాగితే ఘటనకు సాక్షులుగా ఉన్న విద్యార్థులు రెండు, మూడేళ్లలో తమ చదువు పూర్తి చేసుకుని వెళ్లిపోతారని, న్యాయం జరిగే అవకాశాలు సన్నగిల్లుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీలో యాజమాన్యపరమైన లోపాలు అనేకం ఉన్నాయని ముఖ్యమంత్రికి చెప్పామని, ర్యాగింగ్‌లపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని ప్రిన్సిపల్ బాబూరావుపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. తమకు మీడియా, విద్యార్థి సంఘాలు కొండంత అండగా నిలిచాయని చెప్పారు. ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామన్నారు.

ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు
 ‘మా బిడ్డలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. భవిష్యత్తులో మరే ఆడపిల్లా బలి కాకూడదు. ఇకనుంచి ఏ వర్సిటీ లోనూ ర్యాగింగ్‌కు చోటు ఉండకూడదు. ర్యాగింగ్‌ను రూపుమాపడం ద్వారా మా రిషితేశ్వరి అందరికీ గుర్తుండేలా చేయాలి..’ అని రిషితేశ్వరి తల్లిదండ్రులు కోరారు.
 
వర్సిటీ తెరిచిన తర్వాత కూడా విచారణ
 రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లోనూ ర్యాగింగ్ నిరోధానికి గట్టి చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. శుక్రవారం విజయవాడలో రిషితేశ్వరి తల్లిదండ్రులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వర్సిటీకి సెలవులు ఇచ్చి విచారణ చేయడం వల్ల వాస్తవాలు వెలుగులోకి రావని రిషితేశ్వరి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీ తెరిచిన తరువాత మరో  రెండురోజులు విచారణ చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ర్టంలోని అన్ని వర్సిటీల వైస్ చాన్సలర్‌లతో సమావేశం నిర్వహించి ర్యాగింగ్ నిరోధానికి ఆదేశాలు ఇచ్చామన్నారు.
 
రిషితేశ్వరి కేసులో న్యాయం చేయాలి
ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విద్యార్థుల ధర్నా..
విజయవాడ బ్యూరో: రిషితేశ్వరి కేసులో న్యాయం చేయాలని నినదిస్తూ విజయవాడలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో వారిపై పోలీసులు లాఠిచార్జి చేశారు. విజయవాడలో శుక్రవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించే సమయంలో సీఎం క్యాంపు కార్యాలయ ప్రధాన గేటు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నేతృత్వంలో విద్యార్థులు ధర్నాకు దిగగా.. విద్యార్థి నాయకులు సహా 30 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వం తక్షణం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
 
 

మరిన్ని వార్తలు