ఆటో స్టార్టర్లు పెడితే రైతులపై కేసులు

8 Apr, 2016 05:07 IST|Sakshi
ఆటో స్టార్టర్లు పెడితే రైతులపై కేసులు

* ఈఆర్సీ బహిరంగ విచారణలో దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి
* పగలు 6 గంటల సరఫరా.. రాత్రి ఇచ్చినా రైతులు వాడుకోరు
* అందుకే 9 గంటల విద్యుత్ అవసరాలను వార్షిక నివేదికలో చూపలేదు
* రైతులు ఆటో స్టార్టర్లు పెడితే కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేస్తాం
* అవసరమున్నవారు రాత్రివేళ పొలానికెళ్లి స్విచ్ వేసుకోవాలని వ్యాఖ్య
* చార్జీల పెంపును వ్యతిరేకించిన పరిశ్రమలు, రైల్వే సంస్థల ప్రతినిధులు

సాక్షి, హైదరాబాద్: ‘‘వ్యవసాయానికి పగటి పూట 6 గంటల విద్యుత్ సరఫరా ఉంటుంది. అవసరమున్న రైతులు రాత్రిపూట కూడా వాడుకోవచ్చు. కానీ పొలానికి వెళ్లి స్విచ్ వేసి, తర్వాత బంద్ చేసుకోవాలి.

వ్యవసాయ పంపుసెట్లకు ఆటో స్టార్టర్లు (విద్యుత్ సరఫరా రాగానే వాటంతట అవే మోటార్లను స్టార్ట్ చేసే పరికరాలు) బిగిస్తే మాత్రం కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలని కోరాం..’’ అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) రెండో రోజు గురువారం నిర్వహించిన బహిరంగ విచారణలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విచారణకు పారిశ్రామిక, వాణిజ్య, రైల్వే సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యుత్ రంగ నిపుణులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యుత్ చార్జీల పెంపు, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ, అదనపు సర్‌చార్జీలపై వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాకు అవసరమైన విద్యుత్ డిమాండ్‌ను ‘వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)’లలో చూపకపోవడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు కావాల్సిన సబ్సిడీని ప్రభుత్వం కేటాయించలేదేమని ప్రశ్నించారు. ఈ అభ్యంతరాలు, విజ్ఞప్తులపై రఘుమారెడ్డి చివర్లో బదులిచ్చారు. వ్యవసాయానికి పగటి పూటే 6 గంటల విద్యుత్ సరఫరా ఉంటుందని.. దీనివల్ల రైతులు రాత్రిపూట విద్యుత్‌ను వాడుకోరనే ఉద్దేశంతోనే 9 గంటల విద్యుత్‌కు సంబంధించిన సమాచారాన్ని ఈఆర్సీకి సమర్పించలేదని చెప్పారు.

ఎగువ రాష్ట్రాల్లో బాబ్లీ తదితర ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి తగ్గిపోయిందని... అందుకే జల విద్యుత్ ధరను యూనిట్ రూ.3.32కు పెంచామని పేర్కొన్నారు. రాత్రిపూట విద్యుత్‌ను వినియోగించుకునే పరిశ్రమలకు కొత్తగా ప్రకటించిన 55 పైసల రాయితీని రూపాయికి పెంచే అంశాన్ని వచ్చే ఏడాది పరిశీలిస్తామన్నారు. అధిక విద్యుత్ టారిఫ్ గల వాణిజ్య కేటగిరీ నుంచి పారిశ్రామిక కేటగిరీకి మార్చాలని వివిధ సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను తిరస్కరిస్తున్నామని తెలిపారు.

ప్రత్యేక కేటగిరీ కింద టారిఫ్ విధించాలని స్పిన్నింగ్ మిల్లులు, ఆఫ్‌సెట్ ప్రింటర్లు తదితర సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటే కేటగిరీల సంఖ్యకు వందకు మించిపోతుందని పేర్కొన్నారు. రైల్వేలకు టారిఫ్ పెంపు న్యాయోచితంగానే ఉందన్నారు. ఆర్వో ప్లాంట్లను కమర్షియల్ కేటగిరీ నుంచి మళ్లీ పరిశ్రమల కేటగిరీకి మార్చామని చెప్పారు.
 
గోదావరిపై ప్రాజెక్టుతో.. కృష్ణాలో విద్యుత్ తగ్గింది!
ఎగువ రాష్ట్రాల్లో నిర్మించిన బాబ్లీ తదితర ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి తగ్గిపోయిందని ఎస్పీడీసీఎల్ రఘుమారెడ్డి తన వివరణలో పేర్కొన్నారు. అందుకే జల విద్యుత్ ధర పెంచాల్సి వచ్చిందన్నారు. అసలు మహారాష్ట్ర గోదావరిపై బాబ్లీ ప్రాజెక్టును నిర్మించగా... రాష్ట్రానికి జల విద్యుత్ అందించే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కృష్ణా నదిపై ఉన్నాయి. గోదావరిపై జల విద్యుత్ ప్రాజెక్టులేమీ లేకపోయినా.. బాబ్లీ వల్ల జల విద్యుత్ తగ్గిందని రఘుమారెడ్డి పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు