ఓటుకు కోట్లు కేసులో బాబు పాత్రపై దర్యాప్తు

30 Aug, 2016 02:16 IST|Sakshi
ఓటుకు కోట్లు కేసులో బాబు పాత్రపై దర్యాప్తు

- సెప్టెంబర్ 29లోగా నివేదిక సమర్పించండి
- ఏసీబీ అధికారులకు ప్రత్యేక కోర్టు ఆదేశం
- ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబును నిందితునిగా చేర్చాలి
- ఆయన గొంతును ఫోరెన్సిక్ ల్యాబ్‌కూడా నిర్ధారించింది
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్
- పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం

 

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. దర్యాప్తు నివేదికను సెప్టెంబరు 29లోగా సమర్పించాలని న్యాయమూర్తి సోమవారం ఏసీబీని ఆదేశించారు.

 

ఓటుకు కోట్లు కుట్ర కేసులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని, ఆయనపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 120(బి)కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి(ఆర్కే) ఈనెల 8న ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. నేర విచారణ చట్టం సెక్షన్ 210 కింద విచారణ చేపట్టాలని ఆ ఫిర్యాదులో కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అల్లం రమేశ్‌లు సోమవారం సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ‘‘ప్రభుత్వాలు రాజ్యాంగం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించనప్పుడు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకొని రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించాలి’’ అన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రస్తావించారు.

 

చంద్రబాబుదే ప్రధాన పాత్ర: ‘‘నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను రూ.5 కోట్లకు కొనేందుకు చేసిన కుట్రలో చంద్రబాబునాయుడే ప్రధాన పాత్ర పోషించారు. ఈ కేసులో కీలక సూత్రధారి అయిన చంద్రబాబునాయుడిని మొదటి నిందితునిగా చేర్చాల్సి ఉంది. టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తే రూ.2.5 కోట్లు ఇస్తారంటూ టీడీపీ తరఫున జెరూసలెం మత్తయ్య స్టీఫెన్‌సన్‌ను కలసి ప్రలోభపెట్టారు. తర్వాత రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. రూ.5 కోట్లు ఇవ్వడానికి బాస్ అంగీకరించారని, అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలు ఇస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మిగిలిన నాలుగున్నర కోట్లు రేపు ఇస్తామని చెప్పారు. స్టీఫెన్‌సన్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు...రూ.50 లక్షలు ఇస్తుండగా రేవంత్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డిని ప్రధాన నిందితునిగా చేర్చారు.

 

ఓ దశ వరకు దర్యాప్తు బాగానే సాగిన తర్వాత ఆగిపోయింది. చంద్రబాబును నిందితునిగా చేర్చాల్సి ఉన్నా ఏసీబీ పట్టించుకోలేదు. అందుకే ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేయాల్సి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేసిందని ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు అంగీకరించారు. దీన్ని బట్టి చూస్తే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది తానేనని చంద్రబాబు అంగీకరించారు. అయినా చంద్రబాబును ఏసీబీ నిందితునిగా చేర్చలేదు’’ అని న్యాయవాదులు వివరించారు.

 

అన్ని ఆధారాలు ఉన్నా..: ఈ కుట్రలో బాబు కీలకపాత్ర పోషించారని నిరూపించేం దుకు అవసరమైన అన్ని ఆధారాలూ ఉన్నాయని న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. కేసు నమోదు చేసి 14 నెలలు దాటినా ఈ కేసు లో చంద్రబాబుని ఏసీబీ నిందితునిగా చేర్చలేదని వారు పేర్కొన్నారు. తాను చంద్రబాబునాయుడు పంపితేనే వచ్చానని ఈ కేసులో మొద టి ముద్దాయిగా ఉన్న రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారని వివరించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబునాయుడు ప్రత్యక్షంగా మాట్లాడారని, మనవాళ్లూ అంతా బ్రీఫ్ చేశారని చెప్పారన్నారు. ఈ స్వరం చంద్రబాబునాయుడిదేనని నిర్ధారిస్తూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. అన్ని ఆధారాలు ఉన్నా ఏసీబీ ఆయన్ను నిందితునిగా చేర్చలేదని పేర్కొన్నారు. ఈ మేరకు పిటిషనర్ సమర్పించిన ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి...ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించారు. పిటిషనర్ సమర్పించిన అన్ని ఆధారాలను ఏసీబీకి పంపాలని తన సిబ్బందిని ఆదేశించారు. దర్యాప్తు నివేదికను వచ్చే నెల 29లోగా సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పు అనంతరం పిటిషనర్ ఆళ్ల రామక్రిష్ణారెడ్డి, న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 

కీలకసాక్షిగా సీమాకొటాల్వర్

ఈ కేసులో ముంబైకి చెందిన డిజిటల్ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ సంస్థలో సైంటిస్టుగా పనిచేస్తున్న సీమాకొటాల్వర్ కీలకసాక్షిగా మారనున్నారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబునాయుడేనని సీమాకొటాల్వర్ నిర్ధారించారు. ఈ నివేదిక ఈ కేసులో కీలక ఆధారంగా మారనుంది. రామక్రిష్ణారెడ్డి తన ఫిర్యాదులో సీమాకొటాల్వర్‌ను ఐదో సాక్షిగా పేర్కొన్నారు.

 

చంద్రబాబు తప్పుచేశారు... తప్పించుకోలేరు: ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి

‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారు. ఈ అక్రమార్జనతో... బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. అయినా నిస్సిగ్గుగా నేను గొప్పవాడిని, నిజాయితీపరుడిని అంటున్నాడు. చంద్రబాబు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి ఈ కేసు నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. తప్పు చేసినా అందరినీ మభ్యపెడుతున్నాడు. తన వాయిస్ రికార్డులను ఎక్కడ నిర్ధారిస్తారో, తన బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఫోరెన్సిక్ ల్యాబ్ డెరైక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ట్రూత్ ల్యాబ్స్ అధినేత కేపీసీ గాంధీని అవసరం లేకపోయినా ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే తన సలహాదారుగా నియమించుకొని కేబినెట్ హోదా ఇచ్చారు. అందుకోసం పాత తేదీలతో జీవోలు జారీచేశారు.

 

ఈ కేసులో తనను ఎక్కడ ముద్దాయిగా చేరుస్తారో అన్న భయంతో ఏపీకి ప్రత్యేక హోదాను కూడా అడగలేకపోతున్నాడు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబే అని ప్రజలందరికీ తెలుసు. అయినా ఆయన బొంకారు. అందుకే ఆయన దావోస్ ఆర్థిక సదస్సులో మాట్లాడిన స్పీచ్‌ను, ఏసీబీకి దొరికిన వాయిస్‌ను పరిశీలన కోసం ఓ ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాం. మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ అంటూ మాట్లాడింది చంద్రబాబేనని ఆ ల్యాబ్ నిర్ధారించింది. ఒక దశలో తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా చంద్రబాబు బెదిరించారు. తనకూ ఏసీబీ ఉందని, తనకూ హైదరాబాద్‌లో పోలీసులు ఉన్నారంటూ కేసీఆర్‌ను బెదిరించాడు. తర్వాత కేసు నుంచి బయటపడేందుకు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నాడు. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అయినా ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు హడావుడిగా.. లేని రాజధానికి పారిపోయారు. ఉద్యోగులను అక్కడికి రావాలంటూ ఇబ్బందులు పెడుతున్నారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించి ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నా ఏసీబీ ఆయన్ను నిందితునిగా చేర్చలేదు. అందుకే ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాను.

 

సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి...తన ఫిర్యాదును ఏసీబీకి పంపి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. నేరం చేసి అడ్డంగా దొరికినా చట్టం నుంచి తప్పించుకొని పెద్ద మనిషిలా చెలామణి అవుతున్నాడు. చట్టం మీద, న్యాయవ్యవస్థ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే చంద్రబాబు తప్పుకోవాలి. అప్పీల్‌కు వెళ్లకుండా ఏసీబీ దర్యాప్తునకు సహకరించాలి. చంద్రబాబు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించినా ఈ కేసు నుంచి ఆయన తప్పించుకోలేరు. చివరికి న్యాయమే గెలుస్తుంది’’

 

చట్టం ముందు దోషిగా నిలబెట్టాం: న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

‘‘ తప్పు చేసి తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబును చట్టం ముందు దోషిగా నిలబెట్టాం. నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నిస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. అయినా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తూ అన్ని వ్యవస్థలను మేనేజ్‌చేసి దోషిగా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అన్ని ఆధారాలున్నా 14 నెలలు గడిచినా ఆయన్ను నిందితునిగా చేర్చలేదు. కళ్ల ముందే అవినీతిపరుడు తిరుగుతున్నా ప్రభుత్వ వ్యవస్థలు పట్టించుకోకపోవడాన్ని చూస్తూ ఊరుకోలేక ఈ పిటిషన్ దాఖలు చేశాం. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం...ఏసీబీ రికార్డు చేసిన స్వర నమూనా ఆయనదేనంటూ నిర్ధారిస్తూ ఓ ల్యాబ్ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాత...మా ఫిర్యాదును ఏసీబీకి పంపారు. ఈ కుట్రలో చంద్రబాబు పాత్రపై మేం సమర్పించిన అన్ని ఆధారాలను ఏసీబీకి పంపాలని ఆదేశించారు. ఓటుకు కోట్లు కేసును పునర్విచారణ చేయాలని స్పష్టం చేశారు. చివరికి న్యాయమే గెలిచింది. ఈ రోజు న్యాయదేవత సగర్వంగా తల ఎత్తుకుంటుంది’’.

మరిన్ని వార్తలు