రేపటి నుంచి నగదు రహిత వైద్య సేవలు

4 Dec, 2013 02:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు గురువారం నుంచి నగదు రహిత (క్యాష్‌లెస్) వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి తెలిపారు. ఇకపై వీరంతా నిర్దేశిత ప్రైవేటు ఆస్పత్రులన్నింటిలో ఎలాంటి నగదూ చెల్లించకుండా వైద్యం పొందవచ్చునని మంగళవారం ఒక ప్రకటనలో చెప్పారు. వైద్య సేవలను ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ పర్యవేక్షిస్తుందన్నారు. ఉద్యోగులకు జనవరి వేతనం నుంచి, పెన్షనర్లకు ఫిబ్రవరి నుంచి  వైద్య సేవలకు చెల్లింపులు జరుగుతాయని తెలిపారు.

 

కార్డుల కోసం ఇప్పటివరకూ 91వేలకు పైగా పెన్షనర్ కుటుంబాలు, 11,642 ఉద్యోగుల కుటుంబాలు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ప్రాథమిక పరిశీలన అనంతరం పెన్షనర్లు, వారి కుటుంబ సంభ్యులకు 1,40,586 తాత్కాలిక హెల్త్ కార్డులు జారీ చేశామని, ఉద్యోగులకు మరో 32,563 కార్డులు ఇచ్చామన్నారు. ఈ కార్డులు వచ్చే ఏడాది మార్చి 31 వరకే అమల్లో ఉంటాయని, ఆ తర్వాత శాశ్వత కార్డులు ఇస్తామని చెప్పారు. వచ్చే నెల 1 తర్వాత వచ్చిన మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లకు అనుమతి ఉండదన్నారు. కార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయని ఉద్యోగులు, పెన్షనర్లు వెంటనే www.ehf.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చని, లేదంటే నామమాత్రపు ఫీజు చెల్లించి మీ సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చునని చెప్పారు.

>
మరిన్ని వార్తలు