'పిల్లలపై అత్యాచారాలకు అదే మందు'

26 Oct, 2015 09:23 IST|Sakshi
'పిల్లలపై అత్యాచారాలకు అదే మందు'

పిల్లలపై అత్యాచారాలను అరికట్టాలంటే.. ఒకటే మందు ఉంటుందని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. అదే.. విత్తుకొట్టడం. అవును.. మీరు సరిగ్గానే చదివారు. ఈ శిక్ష విధిస్తే మాత్రమే చిన్నారులపై అత్యాచారాలు తగ్గుతాయని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. కిరుబకరన్ వ్యాఖ్యానించారు. సంప్రదాయ చట్టాలు వీళ్లమీద ఎలాంటి ప్రభావం చూపించడం లేదని, వాస్తవానికి విత్తుకొట్టడం లాంటి శిక్షలు అరాచకంగా అనిపించినా.. అచారకమైన నేరాలకు తప్పనిసరిగా అరాచక శిక్షలే విధించాలని ఆయన అన్నారు. దీంతో చాలామంది అంగీకరించకపోవచ్చు గానీ, సమాజంలో పెరిగిపోతున్న దారుణాలకు ఇది మాత్రమే సరైన మందు అని ఆయన చెప్పారు. 2008 నుంచి 2014 వరకు చిన్నపిల్లలపై జరిగిన అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడినది కేవలం 2.4 శాతం మంది నేరస్థులకేనని, అయితే ఇదే సమయంలో పిల్లలపై నేరాలు 400 శాతం పెరిగాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అమెరికా సహా పలు దేశాల్లో ఇప్పటికే విత్తుకొట్టడం లాంటి శిక్షలు అమలులో ఉన్నాయని, అందుకే అక్కడ ఈ తరహా నేరాలు బాగా తగ్గాయని చెప్పారు.

తమిళనాడులో పిల్లలపై అత్యాచారం చేసిన ఓ విదేశీయుడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టేసే సందర్భంగా జస్టిస్  ఎన్. కిరుబకరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో గత వారం ఇద్దరు చిన్నారులపై దారుణంగా జరిగిన సామూహిక అత్యాచారాల నేపథ్యంలో కోర్టు ఇంత తీవ్రంగా స్పందించింది. పిల్లలపై అత్యాచారాలు చేసిన వాళ్లకు విత్తుకొట్టే శిక్షలను ఇప్పటికే రష్యా, పోలండ్, ఈస్టోనియా, అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, తాజాగా ఆసియాలో మొట్టమొదటిగా దక్షిణ కొరియా కూడా ఈ శిక్షలను అమలు చేయడం ప్రారంభించిందని అన్నారు.

మరిన్ని వార్తలు