బాలీవుడ్ దిగ్గజాలకు టాక్స్ నోటీసులు

27 Jul, 2016 19:00 IST|Sakshi
బాలీవుడ్ దిగ్గజాలకు టాక్స్ నోటీసులు

ముంబై : బాలీవుడ్ దిగ్గజాలకు సర్వీసు టాక్స్ నోటీసులు జారీ అయ్యాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అమీర్ ఖాన్, రన్ వీర్ సింగ్ లాంటి అధిక పేరు ప్రఖ్యాతలున్న మూవీ మేకర్లు, యాక్టర్లకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఎఫ్సీ) ఈ నోటీసులు జారీచేసింది. అమీర్ ఖాన్, రన్ వీర్ సింగ్లాంటి స్టార్ హీరోలకు ఎంత మొత్తంలో రెమ్యూనురేషన్ చెల్లించారో తెలపాలని ఆదేశిస్తూ టాప్ ప్రొడక్షన్ హోస్లకు ఈ నోటీసులు పంపింది. అదేవిధంగా యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ లాంటి ప్రొడక్షన్ సంస్థల నుంచి యాక్టర్లు తీసుకున్న రెమ్యూనురేషన్ వివరాలు తెలపాలని యాక్టర్లనూ సీబీఎఫ్సీ ఆదేశించింది. అధిక పేరు ప్రఖ్యాతలున్న సర్వీసు టాక్స్ ఎగవేతదారుల సమాచార ఏరివేతలో భాగంగా, పన్ను అధికారులు ఈ నోటీసులు జారీచేస్తున్నట్టు గ్లామర్ వరల్డ్ చెబుతోంది.

యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అమీర్ ఖాన్, రన్ వీర్ సింగ్లు తాజాగా సర్వీసు టాక్స్ డివిజన్ నుంచి ఈ నోటీసులు అందుకున్నారని దీనికి సంబంధించిన ఓ అధికారి చెప్పారు. ఇంటిలిజెన్స్ ఆఫీసర్లు వారి వద్ద నుంచి చెల్లింపులు,  రెమ్యూనురేషన్  వివరాలను కోరుతూ ఈ ఎంక్వయిరీ లేఖలు పంపారని ఆయన పేర్కొన్నారు. బాలీవుడ్ లో సర్వీసు టాక్స్ ఎగవేతదారులను గుర్తించే పనిలో డిపార్ట్మెంట్ ప్రస్తుతం నిమగ్నమైందని, ఈ వారంలోనే వారినుంచి సమాచారాన్ని కోరే అవకాశముందని తెలుస్తోంది. ఏక్తా టైగర్, ధూమ్ 3, బాజీరావ్ మస్తానీ, బజరంగీ భాయిజాన్, సుల్తాన్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీలను ఈ ప్రొడక్షన్ సంస్థలు, నటులు తీశారు.

మరిన్ని వార్తలు