ఛోటా రాజన్కు 10 రోజుల సీబీఐ కస్టడీ

8 Nov, 2015 00:46 IST|Sakshi
ఛోటా రాజన్కు 10 రోజుల సీబీఐ కస్టడీ

న్యూఢిల్లీ: నకిలీ పాస్‌పోర్టు కేసులో మాఫియా డాన్ ఛోటా రాజన్‌కు కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. భద్రతా కారణాల నేపథ్యంలో శనివారం సీబీఐ ప్రధాన కార్యాలయంలోనే కోర్టు విచారణ జరిపింది. అనంతరం మేజిస్ట్రేట్ అతణ్ని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. నకిలీ పాస్‌పోర్టుతో దేశం విడిచిపారిపోయినందుకు రాజన్‌పై సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. ఇందులో ఒక కేసును అతడిని తీసుకురావడానికి మలేసియా వెళ్లే ముందు కిందటి నెల 31న నమోదు చేసింది.

ఈ కేసులోనే కోర్టు అతడికి సీబీఐ కస్టడీ విధించింది.  గతనెల 25న ఆస్ట్రేలియా నుంచి ఇండోనేసియాకు వచ్చిన రాజన్‌ను బాలిలో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం బాలి నుంచి సీబీఐ అధికారులు రాజన్(అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే)ను ఢిల్లీకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.  రాజన్  నకిలీ పాస్‌పోర్టులో తండ్రి పేరుగా రాజన్ పేరే ఉంది. ఇండోనేసియా నుంచి ఢిల్లీకి రాజన్‌ను తరలించాక అతని నుంచి అధికారులు సేకరించిన వాటిలో ఈ పాస్‌పోర్టు ఉంది.

మరిన్ని వార్తలు