సీబీఐ చేతికి రేప్ కేసు విచారణ

19 Aug, 2016 19:57 IST|Sakshi
సీబీఐ చేతికి రేప్ కేసు విచారణ

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో అత్యంత దారుణంగా జరిగిన గ్యాంగ్‌రేప్ కేసు విచారణ బాధ్యతలను సీబీఐ తీసుకుంది. కారులో వెళ్తున్న తల్లీకూతుళ్లను బయటకు లాగి వారిని దోచుకుని ఆపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన యావద్దేశాన్ని కుదిపేసింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆ కేసు విచారణను సీబీఐ తీసుకుంది. ఈ విషయాన్ని సీబీఐ అధికార ప్రతినిధి దేవ్‌ప్రీత్ సింగ్ నిర్ధారించారు.

దీనిపై ఐపీసీ సెక్షన్లు 395, 397, 376డి, 342లతో పాటు పోస్కో చట్టం కింద కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. 91వ నెంబరు జాతీయ రహదారిపై బులంద్ షహర్ జిల్లాలో జూలై 29న ఈ దారుణం జరిగింది. నోయిడాకు చెందిన ఆరుగురు సభ్యుల కుటుంబం కారులో వెళ్తుండగా.. కొంతమంది దుండగులు వారిని ఆపి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మరణించడంతో వారిని పలకరించేందుకు షాజహాన్‌పూర్ వెళ్తున్నారు. తాము ఫిర్యాదుచేసినా పోలీసులు సరిగా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. చివరకు కేసు దర్యాప్తు కూడా సక్రమంగా సాగకపోవడంతో.. చివరకు హైకోర్టు సూచనల మేరకు సీబీఐ రంగప్రవేశం చేసింది.

మరిన్ని వార్తలు