సీఎస్ వరం.. సీసీఎల్‌ఏ నిర్లక్ష్యం

12 Oct, 2015 02:46 IST|Sakshi

- అమలుకు నోచుకోని సీఎస్ హామీలు
- రెవెన్యూ ఉద్యోగులకు తప్పని పాట్లు
- నాన్చుడు ధోరణిలో సీసీఎల్‌ఏ అధికారులు
 
సాక్షి, హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితి. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు గత జూలైలో ఆందోళన (వర్క్ టు రూల్) చేశారు. దీంతో సర్కారు సైతం ఒక మెట్టు దిగింది. వారి డిమాండ్లు న్యాయ సమ్మతమైనవేనని, వెంటనే పరిష్కరిస్తామని సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ హామీ ఇచ్చి రెండు నెలలు గడిచాయి. అయినా ఇంతవరకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేరలేదు. దీనికి భూపరిపాలన విభాగం (సీసీఎల్‌ఏ) అధికారుల నాన్చుడి ధోరణే కారణమని తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థలో అత్యధికంగా 23 వేలమంది ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రభుత్వ ఉద్యోగులందరి మాదిరిగానే 010 పద్దు కింద వేతనాలు చెల్లించేందుకు, ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల వేతనాన్ని పీఆర్‌సీ సిఫార్సుల ప్రకారం పెంచేందుకు అంగీకారం తెలుపుతూ.. ఈమేరకు ఫైలు పంపాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. అయితే, సీసీఎల్‌ఏలో ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఉలుకుపలుకు లేదు. దీంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతి నిధులు ప్రతిరోజూ సచివాలయం, భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
 
 ప్రతిపాదనలు పంపేదెన్నడో..
 వీఆర్‌ఏలకు వీఆర్వోలుగా పదోన్నతుల  కోటాను పెంచడం, పదవీ విరమణ పొందిన వీఆర్‌ఏలకు కనీస పింఛను, అర్హులైన డిప్యూటి తహ శీల్దార్లకు తహశీల్దార్లుగా, తహశీల్దార్లకు డిప్యూటి కలెక్టర్లుగా పదోన్నతులు, ఆర్డీవో, తహశీల్దార్లకు వాహన సదుపాయం, మండల, గ్రామ రెవెన్యూ కార్యాలయాల ఆధునీకరణ, రెవెన్యూ కార్యాలయాల గ్రేడింగ్, వీఆర్‌వోల నుంచి కలెక్టర్ వరకు సీయూజీ మొబైల్ కనెక్టివిటీ, కలెక్టరేట్లలో ఉన్న ఏజేసీ పోస్టును జేసీ-2గా చే యడం, పరిపాలనాధికారి (ఏవో) పోస్టులను డిప్యూటి కలెక్టర్ స్థాయికి పెంచడం, డిప్యూటి కలెక్టర్ కేడర్‌లో తహశీల్దార్ల పోస్టుల స్థాయిని తగ్గించడం తదితర డిమాండ్లకు నాడు సీఎస్ అంగీకారం తెలిపారు. వీటిపై సీసీఎల్‌ఏ  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంది.  
 
 మళ్లీ ఆందోళన చేస్తాం
 ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. ప్రమోషన్ల గురించి అడిగితే కోర్టు కేసులంటూ అధికారులు తప్పుకుంటున్నారు. పోనీ మిగిలిన సమస్యలన్నా పరిష్కరించారా అంటే అదీ లేదు. పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొద్దిరోజుల సమయం కోరారు. పరిష్కారం కాకుంటే మళ్లీ ఉద్యమిస్తాం.
 -శివశంకర్, రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
 
 ఎక్కడి సమస్యలు అక్కడే
 చిరుద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం కాకుండా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. పలుమార్లు ధర్నాలు, ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు. పీఆర్సీ సిఫార్సుల మేరకు వేతనం పెంపు, ప్రమోషన్ చానల్ మార్పు, మూడేళ్లకు పదోన్నతి లభించేలా నిబంధనలు మార్చాలని అడుగుతున్నాం.
 -శివరాం, వీఆర్‌ఏ (డెరైక్ట్ రిక్రూట్‌మెంట్)ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

మరిన్ని వార్తలు