కణానికి ‘ఎల్’పై ప్రేమ ఎందుకు ?

4 Dec, 2013 00:47 IST|Sakshi
కణానికి ‘ఎల్’పై ప్రేమ ఎందుకు ?

అమినోయాసిడ్ల ఎంపిక గుట్టు ఛేదించిన సీసీఎంబీ
 సాక్షి, హైదరాబాద్:  మనిషి దేహంలో దశాబ్దాల పరిశోధనల తరువాత కూడా తేలని మిస్టరీలు బోలెడు! హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఇటువంటి ఓ మిస్టరీని విజయవంతంగా ఛేదించి జీవశాస్త్రంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. ఆ వివరాలు... జీర్ణక్రియ, బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షణ,  మన ఒడ్డూ, పొడవు, చర్మపు రంగు జన్యువులను నియంత్రించడం.. ఇలా మన శరీరంలో ప్రొటీన్లు చేసే పనులు ఎన్నో... ఎన్నెన్నో! ఈ ప్రొటీన్లు మూడు రసాయన మూలకాలతో కూడిన అమినోయాసిడ్లతో ఏర్పడతాయి. ఈ మూలకాల్లో ఏ ఒక్క మూలకం మారినా, ఉండాల్సిన స్థానంలో లేకపోయినా విపరీతాలు సంభవిస్తాయి. ఉదాహరణకు... ఒక అమినోయాసిడ్ మారిపోతే ఆ వ్యక్తికి థలసీమియా వంటి ప్రాణాంతక వ్యాధి వచ్చే ప్రమాదముంది. కానీ ఇక్కడో చిక్కుంది. మన శరీరంలో రెండు రకాల అమినోయాసిడ్లు ఉంటాయి.
 
  వీటికి ఎల్, డీ అమినోయాసిడ్లుగా పేరు. మనిషికుండే రెండు చేతుల్లా ఇవీ ఒకే తీరుగా ఉంటాయి. కానీ ఒకదానికొకటి ప్రతిబింబం! దీన్నే కైరాలిటీ అంటారు. విచిత్రమైన విషయం ఏమిటంటే.. మన శరీర కణాలు ఎల్ అమినోయాసిడ్లను మాత్రమే ఉపయోగించుకుని దాదాపు 25 వేల ప్రొటీన్లను తయారుచేస్తూంటాయి. డీ అమినోయాసిడ్లను కణాలు ఎందుకు ఎంచుకోవు? బ్యాక్టీరియా కణాల నుంచి సంక్లిష్ట మానవ కణాల వరకూ ఎలాంటి తప్పుల్లేకుండా ఈ ఎంపిక ఎలా జరుగుతోంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సీసీఎంబీ శాస్త్రవేత్త శంకరనారాయణ సమాధానం కనుక్కున్నారు.
 
 ఒక్క ఎంజైమ్‌తో ‘డీ’లు మాయం: కణాల్లో ప్రొటీన్లను తయారు చేసే ఫ్యాక్టరీలుగా పిలిచే రైబోజోమ్‌లలో కేవలం ఎల్ అమినోయాసిడ్లను మాత్రమే ఎంచుకునే ఒక వ్యవస్థ ఉందన్న విషయం చాలాకాలం కిందటే తెలిసినప్పటికీ డీటీడీ అనే ఎంజైమ్ వల్ల ఇది సాధ్యమవుతోందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
 
 దీన్ని అర్థం చేసుకోవాలంటే కణాల్లో ప్రొటీన్లు ఎలా తయారవుతాయో తెలుసుకోవాలి. మన సమాచారమంతా డీఎన్‌ఏలో దాగి ఉంటుందని మనకు తెలుసు. డీఎన్‌ఏ అమినోయాసిడ్లు, చక్కెరలతో తయారవుతుందనీ మనం చదువుకుని ఉంటాం. ప్రొటీన్లను తయారు చేసేందుకు అవసరమైన సమాచారం ఎంఆర్‌ఎన్‌ఏ అనే నిర్మాణం డీఎన్‌ఏ నుంచి కాపీ చేసుకుంటే... టీఆర్‌ఎన్‌ఏ దాన్ని మోసుకుని రైబోజోమ్‌లోకి చేరుతుంది. ఇంకోలా చెప్పాలంటే ప్రొటీన్ల నిర్మాణానికి అవసరమైన అమినోయాసిడ్లు రైబోజోమ్‌లోకి వస్తాయన్నమాట. సరిగ్గా ఇక్కడే డీటీడీ ఎంజైమ్ పనిచేయడం మొదలవుతుంది. ఈ అమినోయాసిడ్లలో ఎల్, డీ రెండు రకాలూ ఉంటాయి. కానీ రసాయన నిర్మాణం, ఎంజైమ్‌లో అవి అతుక్కునే స్థానాలను బట్టి డీటీడీ ఏది ఎల్, ఏది డీ అన్నది గుర్తిస్తుంది. తదనుగుణంగా ఎల్‌లను మాత్రమే ఉంచుకుని డీలను కత్తిరించి పక్కకు తోసేస్తుంది.
 
 ఉపయోగమేమిటి?:
జీవశాస్త్రంలో అత్యంత మౌలికమైన ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం లభించడం అన్నింటికంటే ముఖ్యమైన ఉపయోగం. అదేసమయంలో మన మెదడులో డీ అమినోయాసిడ్లను ఉపయోగించుకునే న్యూరోనల్ కణాలు ఎక్కువస్థాయిలో ఉంటాయి. ఈ తేడాతో ఉన్న లాభనష్టాలేమిటి? అన్నది ఇకపై తెలుసుకోవచ్చు. తద్వా రా అల్జీమర్స్, పార్కిన్‌సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో కృత్రిమంగా తయారు చేసుకునే ప్రొటీన్లను మనం ఉపయోగిస్తుంటాం. వీటిల్లో ఏవి మనకు ఎక్కువ ఉపయోగడపడతాయో గుర్తించవచ్చు.

మరిన్ని వార్తలు