వేడుకగా శ్రీవారి పారువేట ఉత్సవం

17 Jan, 2016 03:33 IST|Sakshi
వేడుకగా శ్రీవారి పారువేట ఉత్సవం

సాక్షి,తిరుమల: తిరుమల క్షేత్రంలో శనివారం శ్రీవారి పారువేట ఉత్సవాన్ని కన్నుల పండువ గా నిర్వహించారు. జగత్ప్రభువైన శ్రీనివాస చక్రవర్తి శంఖ, చక్ర, గదా, ధనుః, ఖడ్గం..అనే పంచాయుధాలు ధరించి వన విహారార్థం వెళ్లి దుష్ట మృగాలను వేటాడి విజయగర్వంతో తిరిగిరావటమే ఈ ఉత్సవ విశిష్టత. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆయుధధారుడైన స్వామి బంగారు పీఠంపై ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. మరో బంగారు పీఠంపై శ్రీకృష్ణ స్వామి కూడా శ్రీనివాస ప్రభువును అనుసరించగా బాజా భజంత్రీ, పండితుల వేదఘోష నడుమ మధ్యాహ్నం 2 గంటలకు  ఆలయానికి మూడు మైళ్ల దూరంలోని పారువేట మంటపానికి చేరుకున్నారు.

స్వామివారు పంచాయుధాలను ఎక్కుపెట్టి పరుగెడుతుండగా, ఆలయ  అర్చకుడు ఏ.అనంతశయన దీక్షితులు వెండి బల్లెం(ఈటె)తో శ్రీస్వామివారిని అనుసరిస్తూ జంతువుల (నమూనా బొమ్మలు)ను వేటాడారు. అంతకుముందు పూర్వవృత్తాంతం ప్రకారం కృష్ణ స్వామివారు అక్కడే ఉన్న సన్నిధిగొల్ల విడిది కేంద్రానికి  వెళ్లి వెన్నను ఆరగించారు.  చివరగా శ్రీనివాసుడు, శ్రీకృష్ణ స్వామివారు ప్రత్యేక హారతులు అందుకుని భక్తులకు దర్శనమిస్తూ సాయంత్రం 4.45 గంటలకు  ఆలయానికి చేరుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఈవో సాంబశివరావు, డెప్యూటీఈవో చిన్నంగారి రమణ పాల్గొన్నారు.
 
శాస్త్రోక్తంగా గోదాదేవి పరిణయోత్సవం
తిరుమల ఆలయంలో శనివారం గోదాదేవి పరిణయోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మరోవైపు  వైఖానస ఆగమోక్తంగా ‘కాకబలి’ నివేదన  నిర్వహించారు. కనుమ పండుగ  వేకువజాము తోమాల సేవ పూర్తి అయిన తర్వాత కొలువు సేవకు పసుపు, కుంకుమ వేర్వేరుగా కలిపిన అన్నప్రసాదాన్ని ఆనంద నిలయంపై కొలువైన విమాన వేంకటేశ్వరునికి నివేదనగా సమర్పించారు.
 
తిరుమలలో పోటెత్తిన భక్తులు

తిరమలలో శ్రీవారి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 57,831 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు