జైపాల్ ఇంట్లో సంబరాలు

6 Dec, 2013 02:42 IST|Sakshi
జైపాల్ ఇంట్లో సంబరాలు

పాల్గొన్న టీ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీ జేఏసీ నేతలు
 సాక్షి, న్యూఢిల్లీ: పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. కేబినెట్ సమావేశం ముగించుకొని తన నివాసానికి తిరిగివచ్చిన కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు అభినందనలతో ముంచెత్తారు. ఆయనకు స్వీట్లు తినిపిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.
 
 టీ జేఏసీ ఛైర్మన్ కోదండరాం నేతృత్వంలోని నేతలు సైతం జైపాల్‌రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనల్లో ముంచెత్తారు. జైపాల్‌ను అభినందించిన వారిలో ఎంపీలు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, సురేష్ శెట్కార్, టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీ వివేక్, టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలు ఉన్నారు. జేఏసీ నేతల్లో దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, దయాకర్‌లు ఉన్నారు.
 
 చరిత్రాత్మక విజయం: జైపాల్‌రెడ్డి
 తెలంగాణ ఏర్పాటు బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం చరిత్రాత్మక విజయంగా కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అభివర్ణించారు. మంత్రివర్గం భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తీవ్ర ప్రతిఘటన ఉన్న సందర్భంలో దేశ చరిత్రలో ఎప్పుడూ ఒక రాష్ట్రం ఏర్పాటు కాలేదన్నారు. ఎంతో సాహసాన్ని ప్రదర్శించి విభజన నిర్ణయం తీసుకొని అమలు చేసినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్నేళ్లుగా ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరులకు జోహార్లు చెప్పారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగుల కృషి ప్రశసంనీయమని కొనియాడారు. బిల్లుపై అసెంబ్లీలో ప్రశాంతంగా చర్చించి అభిప్రాయాలు వెల్లడించవచ్చని చెప్పారు. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదానికి కృషి చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు