నిరుద్యోగులకు శుభవార్త..లక్షల ఉద్యోగాలు

2 Mar, 2017 11:37 IST|Sakshi
నిరుద్యోగులకు శుభవార్త..లక్షల ఉద్యోగాలు

న్యూఢిల్లీ: నిరుద్యోగులకు శుభవార్త.  ముఖ్యంగా సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి నిజంగా ఇది తీపి కబురు.  కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో   త్వరలోనే భారీ సంఖ్యలో కొలువుల జాతరకు తెరలేవనుంది.  2018 మార్చి నాటికి  2.84 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా పోలీసు ,ఐటీ, కస్టమ్స్‌ శాఖకు ఈ నియామకాల్లో సింహభాగం దక్కనుంది.

సుమారు 2.80 లక్షల మంది అదనపు సిబ్బంది భర్తీకి   కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను  కేటాయించనుంది.  వీరిలో  పోలీసు, ఆదాయం పన్ను, కస్టమ్స్ మరియు కేంద్ర ఎక్సైజ్ విభాగాల్లో 1.80 లక్షల మందిని నియామకాలను చేపట్టనుంది. కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌లో  ప్రకటించిన మేరకు ఈ నియామకాలు చోటుచేసుకోనున్నాయి.  

పాలనను మరింత సరళతరం చేయడంతో పాటు.. ప్రభుత్వ సేవలను పౌరుల కేంద్రంగా మార్చాలని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రభుత్వం భావిస్తోంది.  ఈ నేపథ్యంలో పలు శాఖల్లో  ప్రస్తుతం ఉన్న వారికి రెట్టింపు చేసే  యోచనలో ఉందిట. దీంతోపాటు హోం, మైన్స్‌, విదేశీ వ్యవహారాలు, స్పేస్‌, తపాలా, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ తదితర శాఖల్లోనూ భారీగా నియామకాలు చేపట్టనున్నారట.  ఈ అదనపు కొలువులతో  ప్రజలకు సేవలు మరింత విస్తరించాలని కేంద్రం భావిస్తోంది.. దీంతో 2018కల్లా 2.84 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. దశలవారీ గా నోటిఫికేషన్లను జారీ చేసి,  ఈ నియామకాలను చేపట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా  వేస్తున్నారు.

కాగా  మార్చి 2016 నాటికి,  రైల్వేల్లో 13.31 లక్షల  ఉద్యోగులతో సహా  కేంద్ర ప్రభుత్వ 55 విభాగాలు, మంత్రిత్వశాఖల్లో 32.84 లక్షల సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ  నియామకాల లక్ష్యం నెరవేరితే,  మార్చి 2018 నాటికి  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 35.67లక్షలకు పెరగనుంది.

 

>
మరిన్ని వార్తలు