ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రానికి కేంద్ర బృందం

3 Dec, 2015 01:55 IST|Sakshi
ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రానికి కేంద్ర బృందం

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాల పరిశీలనకు ఒకట్రెండు రోజుల్లో కేంద్ర బృందాన్ని పంపనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ వెల్లడించారు. తక్షణ సహాయం కింద రాష్ట్ర విపత్తు నిర్వహణ రెండో విడత నిధులు రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ఎంపీల ప్రతినిధి బృందం బుధవారం రాధామోహన్ సింగ్‌ను కలసి కరువు మండలాల పరిస్థితులపై నివేదికను అందజేసింది. వారితో భేటీ అనంతరం మంత్రి రాధామోహన్ సింగ్ మాట్లాడుతూ, కేంద్రబృందం కరువు మండలాలను పరిశీలించి నివేదిక ఇచ్చాక సహాయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధులతోపాటు అదనంగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

కొత్త రైతు బీమా పథకంలో రైతులు ఎక్కువ ప్రీమియం చెల్లించలేకపోతున్నందున వారికి వెసులుబాటు ఉండేలా మార్పులు చేస్తామన్నారు. పత్తి మద్దతు ధర నిర్ణయం తమ చేతుల్లో లేదని స్పష్టం చేశారు. ప్రతినిధి బృందంలో డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రి పోచారం, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, కవిత, సీతారాం నాయక్, బాల్క సుమన్, నగేశ్, దయాకర్, కె.ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ ఉన్నారు.

 వచ్చే నెల్లో ఉద్యానవర్సిటీ శంకుస్థాపన
 జనవరి 7న ఉద్యానవన విశ్వవిద్యాలయం శంకుస్థాపనకు వచ్చేందుకు కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్ అంగీకారం తెలిపారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం పోచారం మాట్లాడారు. ఉద్యానవన వర్సిటీ పూర్తిస్థాయిలో పనిచేయాలంటే రూ.1,813 కోట్లు అవసరం ఉంటుందని, 200 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. రూ.75 కోట్లు ఇవ్వడానికి కేంద్రం హామీ ఇచ్చిందని, ఇప్పుడు రూ.10 కోట్లు ఇచ్చిందని చెప్పారు. కరువు మండలాల్లోని సమస్యలను పరిష్కరించడానికి రూ.2,514 కోట్లు అవసరమని, తక్షణ సహాయం కింద రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరామన్నారు.  

 జౌళి శాఖ మంత్రితో భేటీ
 ప్రతినిధి బృందం తొలుత జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌ను కలిసింది. రాష్ట్రంలో పత్తిరైతులు ఎదుర్కొంటున్న సమస్యలను డిప్యూటీ సీఎం కడియం, పోచారం శ్రీనివాసరెడ్డి సవివరంగా గంగ్వార్ దృష్టికి తీసుకెళ్లారు. సీసీఐ నిర్ణయించిన మద్దతు ధర సైతం పత్తిరైతులకు అందడం లేదని, దీన్ని క్వింటాల్‌కు రూ.5 వేలకు పెంచాలని కోరారు. దీనికి గంగ్వార్ స్పందిస్తూ, మద్దత ధర పెంపు తన చేతుల్లో లేదని, వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వం లోని అథారిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 40 క్వింటాళ్ల కన్నా ఎక్కువ పత్తిని తెచ్చినా కొనుగోలు చేస్తామని, రైతుల ఖాతాల్లోకి నేరుగా 48 గంటల్లో డబ్బులు జమచేస్తామన్నారు. అనంతరం బృందం రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కలసి రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు వచ్చే రైల్వే బడ్జెట్‌లో నిధులివ్వాలని కోరింది.

మరిన్ని వార్తలు