బ్యాంకులపై కేంద్రం కీలక నిర్ణయం!

9 Nov, 2016 18:15 IST|Sakshi
శని, ఆదివారాలు బ్యాంకులు పనిచేస్తాయి
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే శనివారం, ఆదివారం కూడా దేశంలోని అన్నీ బ్యాంకులు పనిచేస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. పెద్దనోట్లను రద్దుచేయడం, ఆ వెంటనే బుధవారం బ్యాంకులు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రూ. 500, రూ. వెయ్యినోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. పెద్దనోట్లు చెలామణి కాకపోవడంతో చాలాచోట్ల టోల్‌గేట్ల వద్ద వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులను దూరం చేయడానికి టోల్‌ట్యాక్స్‌లను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
 
పెద్దనోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో బుధవారం బ్యాంకులు వినియోగదారుల సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈరోజు, రేపు ఏటీఎంలు పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో కరెన్సీ మార్పిడి  కోసం జనాలు గురువారం పెద్ద ఎత్తున బ్యాంకులకు పోటెత్తే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సెలవు దినాలైన వచ్చే శనివారం, ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, చిన్నతరహా బ్యాంకులు, రిజినల్‌ రూరల్‌ బ్యాంకులు, అన్ని సహకార బ్యాంకులను ఆదేశిస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీచేసింది.

2 గంటలు ఎక్కువ పనిచేయనున్న బ్యాంకులు!
పెద్దనోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో ప్రజలకు సౌకర్యార్థం తమ బ్యాంకుకు చెందిన అన్నీ శాఖలు రెండుగంటలపాటు అధికంగా పనిచేయనున్నాయని కెనరా బ్యాంకు ఎండీ, సీఈవో రాకేశ్‌ శర్మ తెలిపారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు కూడా తన శాఖల పనివేళలను రెండుగంటలపాటు పొడిగిస్తున్నట్టు తెలిపింది. రద్దైన పెద్దనోట్ల స్థానం కరెన్సీ బదిలీ కోసం ప్రజలు పోటెత్తనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీఐసీఐ తెలిపింది. రేపు, ఎల్లుండి (గురువారం, శుక్రవారం) పొడిగించిన పనివేళలు వర్తిస్తాయని పేర్కొంది.
 
 
 

మరిన్ని వార్తలు