బందీల విడుదలకు విద్యార్థుల దౌత్యం

4 Aug, 2015 03:27 IST|Sakshi
బందీల విడుదలకు విద్యార్థుల దౌత్యం

ఇంకా ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులచెరలోనే తెలుగు ప్రొఫెసర్లు
* ఆందోళనలో గోపీకృష్ణ,బలరాం కిషన్ కుటుంబ సభ్యులు
* ఐఎస్‌ఐఎస్ అనుబంధ  విద్యార్థి సంఘాల ద్వారా విడుదలకు ప్రయత్నాలు


సాక్షి, హైదరాబాద్: లిబియా దేశంలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్‌లకు విముక్తి లభించలేదు. సోమవారం కూడా వీరు విడుదల కాకపోవటంతో ఇరువురు ప్రొఫెసర్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు బందీలుగా ఉన్న ఇద్దరు ప్రొఫెసర్లను విడుదల చేసేందుకు ఐఎస్‌ఐఎస్ అనుబంధ విద్యార్థి సంఘాల ద్వారా దౌత్య అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జూలై 29న స్వదేశానికి వస్తున్న  నలుగురు భారతీయులను ట్రిపోలి సమీపంలో కిడ్నాప్ చేసిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు.. వారిలో కర్ణాటకకు చెందిన ఇద్దరిని వదిలేసి, తెలుగు రాష్ట్రాలకు చెందిన గోపీకృష్ణ, బలరాం కిషన్‌లను తమ వద్ద బందీలుగా ఉంచుకున్న విషయం తెలిసిందే. అయితే కిడ్నాప్‌నకు గురై విడుదలైన కర్ణాటక ప్రొఫెసర్లు ఇచ్చిన సమాచారం మేరకు..

గోపీకృష్ణ, బలరాం కిషన్ ఆదివారం సాయంత్రం లేదా సోమవారం మధ్యాహ్నానికి కచ్చితంగా విడుదల అవుతారని దౌత్య అధికారులతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ, సోమవారం తీపికబురు కోసం రోజంతా వేచిచూసిన గోపీకృష్ణ, బలరాం కుటుంబ సభ్యులు సాయంత్రానికి పూర్తిగా డీలాపడిపోయారు. రాత్రి పొద్దుపోయే వరకు బందీల విడుదలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే దౌత్య అధికారులు మాత్రం హ్యూన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులనే దూతలుగా పంపి గోపీకృష్ణ, బలరాం కిషన్‌ల విడుదల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
 
ప్రభుత్వాధి నేతలూ.. కనికరించండి..
ఏ రోజూ.. ఎవరికీ హాని చేయని తమ వారిని విడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకోవాలని బందీల కుటుంబ సభ్యులు వేడుకున్నారు. సోమవారం గోపీకృష్ణ భార్య కళ్యాణి, సోదరుడు మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. కిడ్నాప్ అయిన నలుగురు ప్రొఫెసర్లలో కర్ణాటకకు చెందిన ఇద్దరు విడుదలయ్యారని తమ వారు కూడా త్వరగా విడుదల అయ్యేలా చూడాలని, దీనికి భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.
 
లిబియా బందీలను విడిపించండి
ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగువారిని విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరినట్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం ఢిల్లీలో చెప్పారు. తొమ్మిది మంది టీఆర్‌ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రేణుకా చౌదరి, రాపోలు ఆనందభాస్కర్‌తో వెళ్లి సుష్మా స్వరాజ్‌ను కలిసినట్టు ఆయన తెలిపారు.
 
దొరకని కేసీఆర్ అపారుుంట్‌మెంట్
సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించామని కానీ లభించలేదని ప్రొఫెసర్ బలరాం కిషన్ కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం బలరాం విడుదల అవుతాడని ఆశాభావంతో ఉన్నామని, లేనిపక్షంలో ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రతినిధులను కలుస్తామని వారు చెప్పారు.

మరిన్ని వార్తలు