మైనారిటీలకు ఉప కోటాపై ‘సుప్రీం’కు

19 Feb, 2014 04:22 IST|Sakshi

 న్యూఢిల్లీ: మైనారిటీల్లో వెనుకబడిన తరగతులకు కేంద్రీయ విద్యాసంస్థల్లో 4.5 శాతం ఉప కోటా అమలుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో అభ్యర్థన దాఖలు చేసింది. సబ్‌కోటా కింద రిజర్వేషన్ కల్పించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం... ఈ కేసులో తాను తుది తీర్పు ఇచ్చేవరకు ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

అలాగే ఇదే కోటా విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిన నేపథ్యంలో ఆ మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా ప్రయోజనాన్ని విస్తరింపజేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం తాజాగా సుప్రీంకు విన్నవించింది. మైనారిటీల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులకు ఓబీసీలకు ఉన్న 27% కోటాలో 4.5% ఉపకోటా అమలు చేస్తామని యూపీఏ ప్రభుత్వం 2011, డిసెంబర్ 22న ప్రకటించిన సంగతి తెలి సిందే. అయితే సబ్‌కోటాను రద్దు చేస్తూ హైకోర్టు 2012, మేలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై స్టే ఇచ్చేం దుకు సుప్రీంకోర్టు 2012, జూన్‌లో నిరాకరించింది.
 

మరిన్ని వార్తలు