పట్టపగలు.. కేబీఆర్ పార్క్ దగ్గర..

17 Sep, 2015 02:51 IST|Sakshi
పట్టపగలు.. కేబీఆర్ పార్క్ దగ్గర..

చైన్ కొట్టేయబోయి.. పట్టుబడ్డ స్నాచర్
* మార్నింగ్‌వాక్ చేస్తుండగా చైన్ దొంగిలించేందుకు యత్నం
* ప్రతిఘటించిన బాధితురాలిపై కత్తితో దాడి
* నిందితుడిని వెంటాడి పట్టుకున్న హోంగార్డులు
హైదరాబాద్: మార్నింగ్ వాక్ చేస్తుండగా ఓ మహిళ మెడలో నుంచి గొలుసు దొంగిలించేందుకు ఓ స్నాచర్ ప్రయత్నించాడు. ప్రతిఘటించిన బాధితురాలిపై కత్తితో దాడి చేసి పరారవ్వాలనుకున్నాడు. కానీ, ఇద్దరు హోంగార్డులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు.

బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు సమీపంలో చోటు చేసుకున్న ఉదంతం ఇదీ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కాలనీలో నివసించే అంకెం నవీన(32) బుధవారం ఉదయం 9.30 సమయంలో హెచ్‌ఎండీఏ వాక్‌వేలో మార్నింగ్‌వాక్ చేసేందుకు వచ్చారు. ఈ సమయంలో నిందితుడు కాలాపు సంతోష్(19) ఆమెను అడ్డగించి మెడలో ఉన్న ఐదు తులాల గొలుసును లాక్కునేందుకు యత్నించాడు. తేరుకున్న నవీన గొలుసును గట్టిగా పట్టుకోవడంతో అది విరిగిపోయింది.

సగం గొలుసు నవీన చేతిలో ఇంకో సగం నిందితుడి చేతిలో ఉండిపోయాయి. అప్రమత్తమైన నవీన దొంగా.. దొంగా అని అరవడంతో ఆమెపై సంతోష్ కత్తితో దాడికి యత్నించాడు. తప్పించుకునేందుకు నవీన చేయిని అడ్డుపెట్టడంతో చేతికి గాయాలయ్యాయి. కళింగ ఫంక్షన్ హాల్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు పి. చంద్రశేఖర్ నవీన అరుపులు విని అటువైపు వచ్చాడు. అదే సమయంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన హోంగార్డు శ్రీనివాస్‌రెడ్డి కూడా అటు వైపు వచ్చాడు.

నవీన అరుపులతో సంతోష్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు తెలంగాణ భవన్‌వైపు హెచ్‌ఎండీఏ వాక్‌వే గ్రిల్‌ను ఎక్కి ప్రధాన రోడ్డువైపు దూకాడు. అయితే ట్రాఫిక్ హోంగార్డు చంద్రశేఖర్, బంజారాహిల్స్ హోంగార్డు శ్రీనివాస్‌రెడ్డి వెంటాడి నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో సంతోష్ నందీనగర్‌లో నివసిస్తున్నట్లు తేలింది. రెండు వారాల క్రితమే బంజారాహిల్స్ పోలీసులు బైక్ దొంగతనం కేసులో అతడిని జైలుకు పంపించగా విడుదలైనట్లు తెలిసింది.
 
హోంగార్డులకు రివార్డు
స్నాచర్ సంతోష్‌ను చాకచక్యంగా పట్టుకున్న ట్రాఫిక్ హోంగార్డు పి.చంద్రశేఖర్‌ను ట్రాఫిక్ డీసీపీ ఎల్‌ఎస్ చౌహాన్ అభినందించారు. అలాగే మరో హోంగార్డు శ్రీనివాస్‌రెడ్డిని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ. వెంకటేశ్వరరావు అభినందించడమే కాక రూ. వెయ్యి నగదు బహుమతి అందించారు.

మరిన్ని వార్తలు