7న చలో హైదరాబాద్: ప్రొఫెసర్ ఎం.కోదండరాం

23 Aug, 2013 04:18 IST|Sakshi
7న చలో హైదరాబాద్: ప్రొఫెసర్ ఎం.కోదండరాం

సాక్షి, హైదరాబాద్: ‘చలో హైదరాబాద్’ పిలుపుతో సెప్టెంబరు మొదటివారంలో రాజధానిలో భారీ శాంతిర్యాలీని నిర్వహించనున్నట్టు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గురువారం నిర్వహించిన సద్భావనాదీక్ష (శాంతిదీక్ష)లో ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు 4-7 తేదీల మధ్య తెలంగాణ ప్రజలంతా హైదరాబాద్‌కు తరలి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి భయాలు లేవని, సంపన్న సీమాంధ్రులే తెలంగాణను అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలోని ఏ ప్రాంతం వారైనా కలిసే ఉంటామని చెప్పడానికి సెప్టెంబరు మొదటివారంలో భారీశాంతి ర్యాలీని నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఉపద్రవం ఏదో వస్తున్నట్టుగా, భారతదేశం నుండి విడిపోతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
 
 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఇదే ఫెడరల్ వ్యవస్థ ఉంటుందని, రాష్ట్రాలన్నీ ఇప్పటిలాగానే పనిచేస్తాయని వివరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో ఒక మాట, ఢిల్లీలో మరోమాట చెప్తూ ఇటు ప్రజలను, అటు అధిష్టానాన్ని మోసం చేస్తున్నాడని విమర్శించారు. నదీ జలాల పంపకం, హైదరాబాద్ వంటివాటిని వివాదం చేసే విధంగా కిరణ్ వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ  వచ్చేదాకా ఇదే ఐకమత్యంతో పోరాడాల్సిందేనని కోదండరాం పిలుపునిచ్చారు. పార్టీ వైఖరిని స్పష్టం చేసిన తర్వాతనే చంద్రబాబు సీమాంధ్రలో యాత్రకు పోవాలని, లేదంటే అది ఆత్మవంచన యాత్రే అవుతుందని టీఆర్‌ఎస్ సంస్థాగత, శిక్షణా శిబిరాల నిర్వహణ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణ ప్రజల సహనాన్ని చేతకానితనంగా భావిస్తే ఎవరికీ మంచిదికాదని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు హెచ్చరించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనుకుంటే ఎవరూ సహించబోరని ఆయన చెప్పారు.
 
 వైషమ్యాలు పెంచడానికి ఎంఐఎం కుట్రలు: కవిత
 తెలంగాణపై ఇలాంటి కుట్రలే కొనసాగితే ఇప్పటిదాకా బతుకమ్మలు ఎత్తుకున్న చేతులతోనే బరిసెలను పడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల ఇంటిపై ఎంఐఎం పేరు రాసుకోవాలని అసదుద్దీన్ చెప్తున్నారని, రాజకీయ లబ్ధికోసం తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య వైషమ్యాలను పెంచడానికి ఎంఐఎం కుట్రలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణపై ఇంకా మోసపూరితంగా వ్యవహరించకుండా చంద్రబాబునాయుడు వైఖరేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పొట్ట నింపుకోవడానికి వచ్చినవారితో సామరస్యంగా ఉంటామని, పొట్టలు కొట్టేవారితోనే తమ పోరాట మని చెప్పారు. ప్రజల మధ్య ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టకుండా, శాంతియుత విభజనకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీక్షలో జేఏసీ నేతలు దేవీప్రసాద్, మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, రఘు, జల వనరులరంగం నిపుణులు ఆర్.విద్యాసాగర్‌రావు తదితరులు ప్రసంగించారు.
 
 సెప్టెంబరు 7న శాంతిర్యాలీ..?
 జేఏసీ నిర్వహించ తలపెట్టిన శాంతిర్యాలీ సెప్టెంబరు 7న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 4 నుంచి7 తేదీల మధ్యనే దీనిని నిర్వహించాలని మొదట భావించారు. అయితే సెప్టెంబరు 3, 4 తేదీల్లో ముల్కీ అమరుల సంస్మరణ దినంగా జరుపుకోనున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబరు 5న ఉండటంతో శాంతి ర్యాలీని 7న నిర్వహించాలని జేఏసీ నేతలు సూత్రప్రాయంగా నిర్ణయించారు.

మరిన్ని వార్తలు