అక్కడి నుంచే ఆఖరి పోటీ: ముఖ్యమంత్రి

15 Jul, 2017 18:34 IST|Sakshi
అక్కడి నుంచే ఆఖరి పోటీ: ముఖ్యమంత్రి

బెంగళూరు: వచ్చే శాసనసభ ఎన్నికలే తన చివరి ఎన్నికలని, తనకు రాజకీయంగా పునర్జన్మనిచ్చిన నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. శనివారం మైసూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. తనను చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నియోజకవర్గం ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని, అదే విధంగా వరుణ నియోజకవర్గ నుంచి పోటీ చేయాలని అక్కడి వారు కోరుతున్నారని, ఈ రెండు నియోజకవర్గా‍లు తనకు ఎంతో ఇష్టమని  సిద్ధరామయ్య అన్నారు.

రాజకీయంగా తనకు పునర్‌ జన్మనిచ్చిన చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో చివరిసారి అక్కడి నుంచి పోటీ చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే ఈ విషయంలో పార్టీ అధిష్టానం పెద్దలు ఎలా చెబితే అలా నడుచుకుంటానన్నారు. ఎన్నికల్లో ప్రజలే న్యాయ నిర్ణేతలని, గెలుపోటములు వారి చేతుల్లో ఉన్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యెడ్యూరప్ప, జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామిలను ప్రజలు నమ్మరని, వారి కుట్రలు ఫలించవని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

నివేదిక వచ్చాకే చర్యలు
బెంగళూరు  పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చాకే చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్రంలో సకాలంలో ముంగారు వర్షాల ఛాయలే లేవని, దీంతో జలాశయాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సిద్ధు చెప్పారు. ఇక ఇక దక్షిణ కన్నడ జిల్లా ప్రశాంతంగా ఉందని, మీడియా, రాజకీయ పార్టీలు సంయమనంతో ఉండాలని, లేని పోనివి ప్రచారం చేయరాదన్నారు. బీజేపీ నాయకులే హిందువులు కాదని, తాను కూడా హిందువేనని వ్యాఖ్యానించారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు