ఒకటి రెండు రోజుల్లోనే జల్లికట్టు: సీఎం

20 Jan, 2017 09:49 IST|Sakshi
ఒకటి రెండు రోజుల్లోనే జల్లికట్టు: సీఎం
ఒకటి రెండు రోజుల్లోనే జల్లికట్టు నిర్వహించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని, అందువల్ల నిరసనకారులు వెంటనే తమ నిరసన ప్రదర్శనలను విరమించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కోరారు. జల్లికట్టు ఆందోళనలకు నడిగర సంఘం మద్దతు పలకడం, ఏఆర్ రెహ్మాన్ ఒకరోజు నిరాహార దీక్ష ప్రారంభించడం, డీఎంకే నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకోలు మొదలవ్వడం లాంటి పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
జల్లికట్టును అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన చట్టానికి సవరణలు తెచ్చే విషయమై రాజ్యాంగ నిపుణులతో వివరంగా చర్చించామని సీఎం అన్నారు. సవరణ ముసాయిదాను తమిళనాడు ప్రభుత్వం ఈరోజు ఉదయమే కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపిందని, దానికి ఒకటి రెండు రోజుల్లోనే అనుమతి వచ్చి, జల్లికట్టుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో సవరణ ముసాయిదా విషయాన్ని చర్చించేందుకు వీలుగా రాష్ట్రానికి చెందిన కొంతమంది సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించినట్లు చెప్పారు. 
 
పట్టాల మీదకు వెళ్లిన స్టాలిన్, కనిమొళి
డీఎంకే నేతృత్వంలో జల్లికట్టు ఆందోళనలకు మద్దతుగా రైల్ రోకో ప్రారంభమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, కరుణానిధి కుమార్తె కనిమొళి తదితరులు కూడా ప్రత్యక్షంగా ఈ ఆందోళనలలో పాల్గొన్నారు. మాంబళం రైల్వేస్టేషన్ వద్ద జరిగిన రైల్‌రోకోలో స్టాలిన్ పాల్గొనగా, ఎగ్మూర్ స్టేషన్‌కు కనిమొళి వెళ్లారు.