బాబు రాజకీయాలకు పట్టిన తుప్పు

21 Jun, 2015 01:53 IST|Sakshi
బాబు రాజకీయాలకు పట్టిన తుప్పు

చంద్రబాబు తప్పులు చేసి, నిందలు తమపై వేస్తారా అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. తన తప్పులపై ఎవరూ మాట్లాడకూడదన్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు. స్టీఫెన్సన్కు రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వడం తప్పు కాదు గానీ, ఆ తప్పును తాము ఎత్తి చూపించడమే తప్పంటున్నారన్నారు. తన తప్పులను ఎవరైనా వేలెత్తి చూపిస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, తెలంగాణ టీడీపీ నేతలతో తమపై కేసు పెట్టించి టీన్యూస్ కు నోటీసులు ఇప్పిస్తారా అంటూ నిలదీశారు. కేసీఆర్ మీద ఏపీలో దాఖలైన కేసులపై సిట్ వేయడం సిల్లీథింగ్ అని ఆయన అన్నారు. ఓటుకు కోట్లు కేసులో మీ అంతట మీరే ఇరుక్కున్నారని, తాము ఇరికించాలనుకుంటే చాలా ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ బిడ్డలు ఇచ్చిన మరణ వాంగ్మూలాల్లో చంద్రబాబు పేరుందని, అది అన్నింటికంటే పెద్ద సాక్ష్యమని తెలిపారు. చంద్రబాబు వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నామని వాళ్లు తమ సొంత చేతిరాతతో రాశారన్నారు. తమకు కక్షసాధింపు ఆలోచన లేదని, తెలంగాణ అభివృద్ధి మీదే దృష్టి ఉందని హరీశ్ అన్నారు. ఒక రాష్ట్రంలో మరో రాష్ట్ర పోలీసుల మోహరింపు ఎక్కడైనా ఉందా అని గవర్నర్ను తాము అడుగుతామన్నారు. దీనిపై కేంద్రం కూడా స్పందించాలని కోరారు. తెలంగాణలో ఆంధ్రా పోలీసు స్టేషన్లను కూడా పెడతామంటున్నారని, ఇదెక్కడి విడ్డూరమని మండిపడ్డారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఆంధ్రావాళ్లు ఉంటారని, వాళ్ల ధనమాన ప్రాణ రక్షణ బాధ్యత కూడా ఆంధ్రా పోలీసులే తీసుకుంటారా అని ప్రశ్నించారు. నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు.. విజయవాడ నుంచి పైపులైన్లు వేసుకుంటారా అని అడిగారు. విమానంలో శంషాబాద్ విమానాశ్రయంలో్ దిగితే నేరుగా సచివాలయానికి వస్తారా, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు రోప్ వేలు వేసుకుంటారా అని మండిపడ్డారు. చంద్రబాబు తమిళనాడు వెళ్లినా, వెంట పోలీసులను తీసుకెళ్తారా.. కర్ణాటకలోను, తమిళనాడులో కూడా పోలీసు స్టేషన్లు పెడతారా? అలా చేస్తే తన్ని తగలేస్తారని స్పష్టం చేశారు.

సండ్ర వెంకట వీరయ్యను విశాఖలో దాస్తారు, మత్తయ్యను విజయవాడలో దాస్తారని, ఇలా నిందితులను దాచే సంస్కృతి ఎక్కడిదని ఆయన అడిగారు. ఇంటి నిర్మాణానికి అనుమతి రాకపోతే దాన్ని కూడా ఇష్యూ చేస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రం మొత్తానికి సీఎంగా చేసిన అనుభవజ్ఞుడికి.. పాత ఇళ్లు కూల్చాలనుకుంటే జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలన్న విషయం తెలియదా అని హరీశ్ రావు అడిగారు. అనుమతి రాకుండా ఇంటి నిర్మాణం మొదలుపెట్టచ్చా? అనుమతి రాకుండా ఎలా మొదలుపెట్టారు? ఇది తప్పా.. ఒప్పా? తప్పయితే ఎందుకు చర్య తీసుకోకూడదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో 10 మీటర్ల ఎత్తు మాత్రమే ఉండాలంటే 12.5 మీటర్లు పెట్టారు... అది డీవియేషనా కాదా అంటూ నిలదీశారు. దేన్నయినా మేనేజ్ చేయగలనని చంద్రబాబుకు గట్టి నమ్మకం ఉందని, అందులో తాను దిట్ట అనుకుంటారని చెప్పారు. ఆయన ఎలా మేనేజ్ చేశారో, ఎక్కడెక్కడ ఎలా తప్పించుకున్నాడో, మేనేజ్మెంట్లో ఆయనకున్న డాక్టరేట్ల గురించి అందరికీ అవగాహన ఉందన్నారు. దేన్నయినా మేనేజ్ చేయగలరు గానీ మా తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలను, మీడియాను మేనేజ్ చేయలేరని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు.

తెలంగాణ మీడియా మీరు చేసిన తప్పులను నగ్నంగా బయటపెడితే అర్ధరాత్రి నోటీసులు ఇస్తారా.. స్థానిక పోలీసులకు చెప్పకుండా ఎలా నోటీసులు ఇస్తారని మండిపడ్డారు. ఏపీ సర్కారు ఒక తప్పు నుంచి తప్పించుకోడానికి పది తప్పులు చేస్తోందన్నారు. తమకు చట్టం మీద గౌరవం ఉందని, మీరు ఎంత కయ్యం పెట్టుకోవాలని చూసినా తమ ప్రభుత్వం చట్ట ప్రకారమే ముందుకు పోతుందని ఆయన అన్నారు. ఒకరోజు ట్యాపింగ్ అన్నారు, ఒకరోజు మార్ఫింగ్ అన్నారు, ఒకరోజు కట్ పేస్ట్ అన్నారు... పూటకో మాట, నాయకుడికో మాట అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంతకీ అసలు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో మాట్లాడిన గొంతు చంద్రబాబుదా.. కాదా అన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు ఇప్పటికీ స్పష్టంగా చెప్పడంలేదంటూ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు