చంద్రబాబు నాయుడు లెక్కలు భలే!

17 Sep, 2013 04:48 IST|Sakshi

జూబ్లీహిల్స్‌లో 1,125 గజాల భవనం విలువ రూ.23 లక్షలేనట
 పక్కనే 1,285 గజాల లోకేశ్ భవనం విలువ రూ.2.36కోట్లే
 పంజాగుట్టలోని భవనం ధర కూడా కేవలం రూ.73 లక్షలు
 మాదాపూర్‌లో 924 గజాల స్థలానికైతే రూ.3.37 లక్షలే
 బాబు కుటుంబ భూముల విలువ గతేడాదే రూ.500 కోట్లంటూ వార్తలు
 ఈ ఏడాది వాటి విలువ మరింత భారీగా పెరిగిందంటున్న నిపుణులు

నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలోని చంద్రబాబు నివాసమిది. 1,125 గజాల్లో ఉన్న ఈ ఇంటి విలువ కేవలం 23.2 లక్షలేనని బాబు చెబుతున్నారు. 2007లోనే ఆయన ఇంటికి సమీపంలో ఉన్న  ప్రభుత్వ భూమిని వేలం వేసినప్పుడు ఐసీఐసీఐ కన్సార్షియం గజం రూ. లక్ష చొప్పున కొనుగోలు చేసింది. ఈ లెక్కన చంద్రబాబు ఇంటి విలువ ఎంత ఉంటుందో తేలికగా అంచనా వేయొచ్చు. ఈ ఉదాహరణ చూస్తే చాలదా.. బాబు ఆస్తి లెక్కలన్నీ.. ఎంతటి కాకి లెక్కలో!
 
 సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఎవరైనా తనకున్న స్థలాన్నో, ఇంటినో విక్రయించాలంటే ప్రస్తుత మార్కెట్ ధర ఎంతో అంతకే అమ్ముతారు. అంతేగాని దాన్ని కొనుగోలు చేసిన రోజు ధర ఎంతుందో ఇప్పుడు కూడా దాని విలువ అదేనని, ఆ లెక్కన తన ఆస్తి కూడా అంతే అనుకొమ్మని అంటే ఎవరైనా నవ్విపోతారు. ఎందుకంటే ప్రభుత్వం నిర్దేశించిన (రిజిస్ట్రేషన్) విలువ కంటే మార్కెట్ రేటు ఎంతో ఎక్కువగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. కానీ తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు మాత్రం తన ఆస్తుల ప్రకటనలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి విలువను దాన్ని కొనుగోలు చేసినప్పటి రూ.23.2 లక్షలుగానే చూపించుకున్నారు!
 
 జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్ 65లో 1,125 చదరపు గజాల ప్లాట్ నంబర్ 1310చంద్రబాబుది. కాగా, దాని పక్కనే 1,285 చదరపు అడుగులున్న 1309 నంబర్ ప్లాట్ ఆయన కుమారుడు లోకేశ్‌ది. తన ఇంటి విలువ ప్రస్తుతం ఎంతో చెప్పకుండా, రూ.23 లక్షలకు కొన్నానని మాత్రమే చెప్పి సరిపెట్టిన బాబు, లోకేశ్ ప్లాట్‌లోని భారీ భవనం విలువను కూడా అలాగే రూ.2.36 కోట్లుగా మాత్రమే చూపించారు. పైగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనగూడ సర్వే నంబర్ 51 (ఎ)లోని ఐదెకరాల భూమి విలువను పేర్కొననే లేదు! దాన్ని లోకేశ్‌కు నాయనమ్మ బహుమతిగా ఇచ్చారని మాత్రమే పేర్కొన్నారు.
 
  ఇక హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో 650 చదరపు గజాల్లో తన భార్య భువనేశ్వరి పేరుతో ఉన్న భవనం విలువను కూడా రూ.73.33 లక్షలుగా చూపారు బాబు!  మహారాష్ట్రలోని అలీబాగ్ తాలూకా సోగాం గ్రామంలో 8.426 ఎకరాల భూమి విలువను రూ.58.69 లక్షలుగా, తమిళనాడులో ఎంజీఆర్ జిల్లా శ్రీపెరుంబదూర్ తాలూకాలోని 2.33 ఎకరాల భూమి విలువ రూ.1.86 లక్షలుగా, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మదీనగూడ సర్వే నంబర్ 51లోని ఐదెకరాల భూమికి రూ.73.8 లక్షలుగా చూపించారు. భువనేశ్వరికున్న 2,780 గ్రాముల బంగారు ఆభరణాల ధర రూ.26.96 లక్షలుగా, 32.7 కిలోల వెండికి రూ.4.57 లక్షలని పేర్కొన్నారు. బాబు కోడలు బ్రహ్మణికి మాదాపూర్‌లో 924 చదరపు గజాల స్థలం విలువను రూ.3.37 లక్షలుగా, నందగిరి హిల్స్‌లోని 778 చదరపు గజాల స్థలం విలువ రూ.4.79 లక్షలుగా, రంగారెడ్డి జిల్లా మణికొండ (సర్వే నంబర్ 211(పి))లోని ప్లాట్ నంబర్ 19, ప్లాట్ నంబర్ 20 కలిపి 2440 చదరపు గజాల స్థలానికి రూ.1.15 కోట్లుగా, చెన్నై టెంపుల్ స్టెప్స్‌లోని 4,782 చదరపు అడుగుల వాణిజ్యపరమైన ఆస్తి విలువను రూ.48 లక్షలుగా చూపారు. ఆమెకున్న 2,325 గ్రాముల బంగారు ఆభరణాలకు రూ.9.9 లక్షలు, 97.441 కిలోల వెండికి రూ.12.37 లక్షలు చూపించారు. ఇవిగాక నిర్వాణ హోల్డింగ్స్, హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాల వివరాలిచ్చారు.
 
 చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం 2013 మార్చి 31కి ఆస్తుల వివరాలు...
 చంద్రబాబు    భువనేశ్వరి    లోకేశ్    బ్రహ్మణి
 42.06 లక్షలు    48.85 కోట్లు    9.73 కోట్లు    3.3 కోట్లు
     ఈ లెక్కన తన మొత్తం కుటుంబ ఆస్తి రూ.62.30 కోట్లేనని వెల్లడించారు బాబు. కానీ గతేడాదే మార్కెట్ ధర మేరకు బాబు కుటుంబ భూముల విలువ కలిపి రూ.500 కోట్లకు పైనే ఉంటుందని మార్కెట్ నిపుణుల అంచనాగా వార్తలొచ్చాయి. ఈ ఏడాది వాటి విలువ మరింత భారీగా పెరిగిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరిన్ని వార్తలు