ప్రభుత్వ ఉద్యోగాలకు గండి

20 Sep, 2015 18:30 IST|Sakshi
ప్రభుత్వ ఉద్యోగాలకు గండి

సాక్షి, హైదరాబాద్: ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు సర్కారు ఎంతకీ అనుమతివ్వడం లేదు. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న వేల పోస్టులను భర్తీ చేయడానికి ఆ శాఖ అధికారులు ఆరేడు నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదికలు అందజేస్తున్నప్పటికీ ఆయన నుంచి స్పందన కరువైంది. ఈ శాఖలో ఒక్క పంచాయతీ కార్యదర్శుల పోస్టులే దాదాపు 2,442వరకు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 12,918 గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ.. రెండు, మూడు చిన్న పంచాయతీలకు ఒక్కటే కార్యదర్శి పోస్టు మంజూరు చేయడంతో 8,742 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకే ప్రభుత్వ అనుమతి ఉంది.

వీటిల్లోనూ ఇప్పుడు 2,442 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి అనుమతి తెలపాలంటూ అధికారులు ఆరు నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదికలు అందజేస్తూనే ఉన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వడానికి సుముఖంగా లేని చంద్రబాబు.. ఖాళీగా ఉన్న పోస్టులను ఇతర శాఖలో అదనంగా ఉన్న ఉద్యోగులతో భర్తీ చేయాలంటూ సమీక్ష సమావేశాలలో అధికారులకు మౌఖిక సూచనలు చేస్తున్నారు.

ఇప్పటికే ఎంపీడీవో, ఈవోపీఆర్డీ పోస్టులకు మంగళం
పంచాయతీరాజ్ శాఖలోనే 128 ఎంపీడీవో, 160 ఈవోపీఆర్డీ పోస్టులను ప్రభుత్వం ఇప్పటికే మాయం చేసింది. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాల్సి ఉండగా.. ఆ పోస్టులన్నింటినీ శాఖలో కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చే సింది. ఉమ్మడి రాష్ట్రంలో 2012 సంవత్సరంలో ఎంపీడీవో పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయి, పరీక్ష కూడా నిర్వహించిన తర్వాత  కోర్టు తీర్పు కారణంగా ఆ పరీక్షను రద్దు చేశారు. ఆ పోస్టులను ప్రభుత్వం ప్రమోషన్ల పద్ధతిన భర్తీ చేసింది.

ఉపాధ్యాయులతో కార్యదర్శుల పోస్టుల భర్తీ
ప్రస్తుతం ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను విద్యా శాఖలో అదనంగా ఉన్న ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అతి తక్కువమంది పిల్లలు ఉన్న స్కూళ్లను వాటికి సమీపంలోని మరొక స్కూలులో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుతం పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు ఆ శాఖలో అదనంగా ఉన్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇలా అదనంగా ఉన్న ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసి, ఉపాధ్యాయ పోస్టులో ఉండే జీతంతోనే వారందరికీ పంచాయతీ కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించాలని ఆలోచిస్తోంది. ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు అధికారుల సమీక్ష సమావేశంలో ఈ విషయంపై ఉన్నతాధికారుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి తనకు ఒక నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు