అక్రమ భూసేకరణలో చంద్రబాబు దాదాగిరి

23 Jul, 2017 01:11 IST|Sakshi
అక్రమ భూసేకరణలో చంద్రబాబు దాదాగిరి

సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌ కాలిన్‌ గాన్‌సాల్వెజ్‌ విమర్శ
అక్రమ భూసేకరణపై సీఎంను ప్రజలు నిలదీయాలి
సింగూరుపై సుప్రీం తీర్పు ఏపీ, తెలంగాణలకు గుణపాఠం
చట్టం స్ఫూర్తిని నీరుగారుస్తున్నారు: జస్టిస్‌ లక్ష్మణరెడ్డి


సాక్షి, హైదరాబాద్‌: రైతాంగం హక్కులను తుంగలోతొక్కి, రాజధాని పేరుతో అక్రమ భూసేకరణలో ఏపీ సీఎం చంద్రబాబు దాదా గిరీ చేస్తున్నారని సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వొకేట్, హ్యూమన్‌ రైట్స్‌ లా నెట్‌ వర్క్‌ వ్యవస్థాపకుడు కాలిన్‌ గాన్‌సాల్వెజ్‌ విమర్శించారు. బలవంతపు భూసేకరణపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను ప్రజలు నిలదీయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకచోట రాజధాని, మరో చోట ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ పేదల రక్తతర్పణతో జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. తెలంగాణ అడ్వొకేట్స్‌ జేఏసీ, మానవ హక్కుల వేదిక, హెల్ప్‌ డెస్క్‌ సంయుక్తాధ్వర్యంలో ఏపీ, తెలంగాణల్లో ‘మానవహక్కులు– చట్టాలు’ అనే అంశంపై హైదరాబాద్‌లో ఒక రోజు సదస్సుని హ్యూమన్‌ రైట్స్‌ లా నెట్‌వర్క్‌ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో కాలి న్‌ గాన్‌సాల్వెజ్‌ కీలకోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు సింగూరు భూసేకరణపై సుప్రీంకోర్టు జస్టిస్‌ గోపాల్‌గౌడ్‌ ఇచ్చిన తీర్పు గుణపాఠం అవుతుందన్నారు. మణిపూర్, కశ్మీర్‌లలో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టం పేరుతో 1,300 మందిని పోలీసులు కాల్చిచంపారని, ఇకపై ఖాకీ దుస్తుల్లో పోలీసులు చేసే చట్టవ్యతిరేక పనులను కోర్టు అనుమతించదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు.

ఆదివాసీల భూములకు ఎసరు..
మానవ హక్కుల వేదిక రెండు రాష్ట్రాల అధ్యక్షుడు జీవన్‌ మాట్లాడుతూ.. 2003లో ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం దాడులకారణంగా ప్రాణాలరచేతిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లోకి వలస వచ్చిన 30 వేల మంది ఆదివాసీలు ఏ హక్కులూ లేకుండా బతుకుతున్నారన్నారు. గోండ్వానా సంక్షేమ పరిషత్‌ నాయకుడు సొండి వీర య్య మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదివాసీల భూములన్నీ ఆదివాసీయేతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు. పోలవరంలో సాదాబైనామీ పేరుతో ఆదివాసీల భూములకు ఎసరుపెట్టారన్నారు. అమరావతి భూనిర్వాసితులు, భూములు కోల్పోయిన రైతుల పక్షాన పోరాడుతున్న అడ్వొకేట్‌ సిరిపురపు ఫ్రాన్సిస్, గాంధీ, కాకినాడ సెజ్‌లకు వ్యతిరేకంగా పోరా డుతున్న నారాయణస్వామి తదితరులు ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు.

సాగు భూములు తీసుకోకూడదు..
కార్యక్రమంలో హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ భూములు తీసుకోకూడదన్న కనీస నియమాన్ని సైతం పాటించకుండా, 2013 భూ సేకరణ చట్టం స్ఫూర్తిని తెలుగు రాష్ట్రాల్లో నీరుగారుస్తున్నారని అన్నారు. రైతుల హక్కులను హరించే ఏ చర్యఅయినా ప్రజలకు చేటు చేస్తుందని, పొలాల్లో నిర్మాణాలు రైతుల అంగీకారం లేనిదే జరపరాదన్న నియమాన్ని అతిక్రమించడం తగదని హితవు పలికారు. తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ.. అసలు భూ సేకరణ అవసరమా లేదా? అవసరమయితే ఎంత? అనేది కూడా తేలకుండానే భూదందాలకు పాల్పడటం ప్రభుత్వాలకు సరికాదన్నారు.

మరిన్ని వార్తలు