అసలు ఆర్థిక నేరగాడు చంద్రబాబే

10 Apr, 2017 02:03 IST|Sakshi
అసలు ఆర్థిక నేరగాడు చంద్రబాబే

విచ్చలవిడిగా దోచుకుంటూ జగన్‌పై ఆరోపణలా : దిగ్విజయ్‌

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణానికి అవసరం కంటే అదనంగా భూములు సేకరించి అక్రమ మార్గంలో కొన్ని కంపెనీలకు కట్టబెడుతూ సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని, అసలు ఆర్థిక నేరస్తుడు ఆయనేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ ధ్వజమెత్తారు. జగన్‌మోహన్‌రెడ్డిని చంద్రబాబు పదేపదే ఆర్థిక నేరస్తుడంటూ పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబుకు జగన్‌పై ఆరోపణలు చేసే హక్కులేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం విలేకరులతో దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఇటు చంద్రబాబు అటు వెంకయ్యలు పర్సెంటేజీల కోసం  ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటూ ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారన్నారు. రైతులు, రైతు కూలీలకు తీవ్ర నష్టం కల్గించేలా ఉన్న 2013 భూసేకరణ చట్టం బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని, దీనికి ఆమోద ముద్ర వేయొద్దంటూ కాంగ్రెస్‌ బృందం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు.

వైఎస్‌ అడుగుజాడల్లో నడుస్తాం...: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలందరూ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తారని నేతలు ప్రకటించారు. వై.ఎస్‌.చేసిన పాదయాత్ర 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీసీసీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం దిగ్విజయ్‌ సింగ్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కేక్‌ కట్‌ చేసి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.కాగా  ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా పి.భగత్‌ను ఎన్నుకున్నారు. విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో ఆదివారం ఎన్‌ఎస్‌యూఐ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

మరిన్ని వార్తలు