చంద్రబాబుకు భూముల పిచ్చి పట్టింది: రామకృష్ణ

22 Apr, 2015 12:38 IST|Sakshi

ఇబ్రహీంపట్నం (కృష్ణా జిల్లా): ఏపీ సీఎం చంద్రబాబుకు భూముల పిచ్చి పట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురంలో యోగా శిక్షకుడు జగ్గీ వాసుదేవ్‌కు 400 ఎకరాలకు పైగా భూములను కేటాయిచాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రామకృష్ణ బుధవారం ఉదయం ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించారు. ఆయన వెంట పార్టీ జిల్లా, స్థానిక నేతలు సుమారు 200 మంది ఉన్నారు. త్రిలోచనాపురంలోని అటవీ భూములను పరిశీలించిన అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు రాజధాని పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో 33వేల ఎకరాలు సేకరించాడని... విజయనగరం జిల్లా భోగాపురంలో 1500 ఎకరాలు సేకరించాలని తలపెట్టాడన్నారు. బాబుకు భూపిచ్చి పట్టుకుందని, కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే ఇలా చేస్తున్నాడని ఆరోపించారు. దీన్ని సీపీఐ తరఫున తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. త్రిలోచనాపురంలో జగ్గీ వాసుదేవ్‌కు ఐదు, పది ఎకరాలు కేటాయిస్తే సరిపోతుందన్నారు. ఇక్కడ వన సంరక్షణ సమితి ద్వారా అటవీ భూములపై వందలాది మంది కూలీలు ఆధారపడి జీవిస్తున్నారని.. ఆ భూములను ప్రభుత్వం వారికే కేటాయించేలా తాము పోరాడతామని రామకృష్ణ చెప్పారు.

మరిన్ని వార్తలు