చివరి క్షణం వరకు తెలంగాణ ను అడ్డుకునే యత్నం !

2 Aug, 2013 03:16 IST|Sakshi
చివరి క్షణం వరకు తెలంగాణను అడ్డుకునే యత్నం !

యూపీఏ, సీడబ్ల్యూసీ భేటీలకు ముందు కాంగ్రెస్ పెద్దలను ‘బాబు’ ప్రాధేయపడ్డారంటూ హిందూస్థాన్ టైమ్స్ కథనం
 
 న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు చంద్రబాబు చివరి క్షణాల దాకా ప్రయత్నించారని ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్ టైమ్స్ పేర్కొంది. తెలంగాణ ఏర్పాటు ఆలోచనను మానుకోవాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రాధేయపడ్డారని గురువారం ప్రచురించిన వార్తా కథనంలో వెల్లడించింది. ఇందుకోసం దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ ఆజాద్ సహా పలువురు కాంగ్రెస్ ముఖ్యులతో బాబు మంతనాలు సాగించారని వివరించింది. ‘గత మంగళవారం జరిగిన యూపీఏ సమన్వయ కమిటీ, సీడబ్ల్యూసీ కీలక భేటీలకు ముందు వారితో బాబు మాట్లాడారు.
 
 తెలంగాణ ఇచ్చే ఆలోచనను విరమించుకోవాలని, కనీసం  ప్రస్తు తానికి వాయిదా అయినా వేయాలని కోరారు’ అని పేర్కొంది. రెండేళ్లకు పైగా కాంగ్రెస్‌తో కుమ్మక్కై బాబు ఆడుతున్న నాటకాలను కూడా ఆ పత్రిక కథనంలో పేర్కొనడం విశేషం! ‘రెండేళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై మేం అవిశ్వాస తీర్మానం కూడా పెట్టలేదు. తద్వారా కిరణ్ సర్కారుకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించాం, అలాగే 294 మంది ఎమ్మెల్యేలుండే రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీకి 79 మంది సభ్యుల బలమున్నా కూడా... గత మార్చిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్‌ఎస్ అవిశ్వాస తీర్మానం పెడితే తటస్థంగా వ్యవహరించాం. తద్వారా కిరణ్ సర్కారు గట్టెక్కేలా చేశాం’ అని గుర్తు చేసినట్లు కథనంలో పేర్కొన్నారు.
 
 హడావుడిగా రాజీనామాలకు ఆదేశం
 కాంగ్రెస్ అధిష్టానానికి చెందిన ముగ్గురు నేతలతో తాను మాట్లాడానని హిందుస్థాన్ టైమ్స్‌లో రావడంపై పార్టీ నేతల వద్ద బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కుమ్మక్కు విషయం బయటపడిన నేపథ్యంలో సీమాంధ్ర ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేయాలని బాబు ఆదేశించినట్టు పార్టీవర్గాలు చెప్పాయి. ఆయ న ఆదేశాలు రావడంతోనే గురువారం రాత్రి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం ప్రారంభించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాజీనామా చేస్తున్నారని, వారికి మద్దతుగా మీరూ రాజీనామా చేయాలని పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని రాజీనామా చేసిన ఒక ఎమ్మెల్యే చెప్పారు.

మరిన్ని వార్తలు