విభజనపై ప్రధాని మన్మోహన్ సింగ్ కు చంద్రబాబు లేఖ

6 Nov, 2013 01:48 IST|Sakshi
విభజనపై ప్రధాని మన్మోహన్ సింగ్ కు చంద్రబాబు లేఖ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయమై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మంగళవారం రాత్రి పొద్దు పోయాక ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, అన్ని ప్రాంతాల జేఏసీలు తదితరులందరినీ ఆహ్వానించి సమస్యలపై విసృ్తతంగా సంప్రదింపులు జరిపాలని అందులో కోరారు. ‘అందరితో చర్చించి రాష్ట్రాన్ని విభజించండి’ అంటూ ఇటీవల ఢిల్లీలో నిరవధిక దీక్ష  చేసిన సమయంలో అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేసిన బాబు, తన తాజా లేఖలో మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావించలేదు. సున్నితమైన, ముఖ్యమైన సమస్యను పరిష్కరించేందుకు ఇ-మెయిల్ ద్వారా అభిప్రాయాలు సేకరించే విధానాన్ని జీవోఎం అనుసరించడం అసంమజసమన్నారు.
 
 రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొన్న తరువాతనే రాష్ర్ట విభజన విషయంలో ముందుకు వెళ్లాలని  కోరారు. ‘తెలంగాణ కు అనుకూలంగా పార్టీ  ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని పలు సందర్భాల్లో పునరుద్ఘాటించాం. తెలుగు మాట్లాడే వారందరికీ సమన్యాయం కోసం పార్టీ పోరాడుతుందని కూడా పేర్కొన్నాం’ అని ప్రస్తావించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ కోసం సీబీఐని కేంద్రం దుర్వినియోగపరిచిందని, కేసులను పక్కదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తీరు, నిర్ణయాలపై ఆ పార్టీ నేతలంతా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం మూడు రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యహరించిందన్నారు. రాష్ర్ట విభజనకు అసెంబ్లీ తీర్మానం చేయాలని, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లడం సరికాదని అన్నారు.
 
 కోడల, మోత్కుపల్లి వాగ్వాదం: మంగళవారం ఉదయం తెలంగాణ, సీమాంధ్ర టీడీపీ నేతలతో బాబు ఉమ్మడిగా సమావేశమయ్యారు. ప్రధానికి లేఖ రాయాలని అప్పుడే నిర్ణయించారు. బాబుతో భేటీ సందర్భంగా సీమాంధ్రకు చెందిన కోడెల శివప్రసాదరావు, తెలంగణకు చెందిన మోత్కుపల్లి నర్సింహులు మధ్య వాగ్వివాదం జరిగింది. వారిద్దరూ తమ ప్రాంతాల ప్రయోజనాలకు అనుగుణంగా తమ వాదాన్ని గట్టిగా విన్పించారు. తర్వాత బాబు నివాసం వద్ద కోడెల, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు విడివిడిగా మీడియాతో మాట్లాడారు. జీవోఎంను బహిష్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు