2018లో చంద్రయాన్-2

14 Dec, 2015 04:49 IST|Sakshi
2018లో చంద్రయాన్-2

సాక్షి, హన్మకొండ: చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని 2017-18లో చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ తెలిపారు. ఆదివారం వరంగల్ నిట్‌లో జరిగిన 13వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి  ఉపరితలంపై తొలిసారిగా రోవర్ దించుతామన్నారు. అంగారక గ్రహంపైకి ప్రయోగించిన మంగళ్‌యాన్ ప్రయోగం ద్వారా ఆ గ్రహానికి సంబంధించిన వాతావరణ వివరాలను తెలిపే ఛాయాచిత్రాలు ఇస్రోకు చేరాయని చెప్పారు. దీంతో అంగారక గ్రహంపై ఉన్న అగ్నిపర్వతాలు, లోయలు వంటి వివరాలతో పాటు అక్కడి ఉపరితలంపై ఉన్న వాతావరణ  సమాచారం తెలిసిందన్నారు.

కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడంలో కీలకమైన క్రయోజనిక్ ఇంజన్‌తో అంతరిక్ష రంగంలో భారతదేశ స్థాయి పెరిగిందన్నారు. వివిధ దేశాలు తమ ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రోను సంప్రదిస్తున్నాయని చెప్పారు. దీని ద్వారా భారీగా ఆదాయం సమకూరుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన సంపూర్ణ (ఎండ్ టూ ఎండ్) పరిజ్ఞానం సాధించిన ఆరు దేశాల సరసన భారత్ నిలిచిందన్నారు. ఇస్రో చేపడుతున్న ప్రయోగాలు ఖగోళశాస్త్ర వివరాలు సేకరించడంతో పాటు దేశప్రగతికి తోడ్పడుతున్నాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు.

శాటిలైట్ నావిగేషన్ ప్రోగ్రామ్ కింద ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో అగ్యుమెంటేడ్ నావిగేషన్)ను చేపట్టినట్లు వెల్లడించారు. దీని వల్ల విమానం, విమానాశ్రయాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు చేరుతుందన్నారు. దీని ఫలితంగా సమర్థంగా విమానాలు నడిపించవచ్చన్నారు. అంతరిక్ష ప్రయోగాల ఫలితాలు సామాన్యులకు చేరుతున్నాయనడానికి టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్‌లు పెద్ద ఉదాహరణగా పేర్కొన్నారు.

తెలంగాణలోని అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ టెలీ ఎడ్యుకేషన్ హబ్‌గా నిలిచిందన్నారు. అమెరికా, చైనా తర్వాత అతి పెద్ద విద్యావ్యవస్థ భారత్‌లో ఉందని, నలంద, తక్షశిల వంటి  ప్రాచీన గురుకుల విద్యాలయాల తరహాలో వరంగల్ నిట్ ద్వారా అత్యుత్తమమైన విద్యార్థులు తయారవుతున్నారని వెల్లడించారు. ఇస్రోలో ఉన్నత స్థానంలో ఉన్న శాస్త్రవేత్తల్లో ఇక్కడి పూర్వ విద్యార్థులు ఎక్కువమంది ఉన్నారని తెలిపా రు. భవిష్యత్తులో బయో, ఇన్ఫర్మేషన్, న్యూక్లియర్, స్పేస్ టెక్నాలజీలతో పాటు సేవరంగాలకు మంచి భవిష్యత్తు ఉందన్నారు.

దేశప్రగతికి, సామాన్యుల జీవిత ప్రమాణాలు పెంచే దిశగా సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త ఆవిష్కణ లు చేపట్టాలని విద్యార్థులకు సూచించారు. నిట్ డెరైక్టర్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేశంలోని అన్ని నిట్‌ల కంటే అత్యధికంగా అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయి(యూజీ)లోఎనిమిది, పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) స్థాయిలో 31 కోర్సులు వరంగల్ నిట్ అందిస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో యూజీ స్థాయిలో 7, పీజీ స్థాయిలో 10 కోర్సులకు ప్రతిష్టాత్మక నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ సంస్థ గుర్తింపు లభించిందన్నారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 1,596 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. వీరిలో 64 మంది డాక్టరేట్ పట్టాలను పొందారు.

మరిన్ని వార్తలు