ఆర్దిక ప్రణాళికను మార్చండి

21 Nov, 2016 00:26 IST|Sakshi
ఆర్దిక ప్రణాళికను మార్చండి
 పొదుపు, మదుపునకు అవకాశం
 భవిష్యత్తులో ఈక్విటీల్లోకి అధిక నిధులు
 నల్లధనంపై చర్యలతో బంగారం, రియల్టీలో తగ్గనున్న డిమాండ్
 ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో క్లిష్ట సమయాలను ఎదుర్కోవడం ఈజీ
 
 ఊహించని సందర్భాలు జీవితంలో ఎదురవుతుండడం సర్వ సాధారణం. ప్రస్తుత నోట్ల రద్దు కూడా ఇటువంటిదే. సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే సందర్భం ఎలాంటిది అయినా నిర్భయంగా, ధైర్యంగా... తొణకకుండా, బెణకకుండా ఉండవచ్చు. అంతేకాదు... మదుపరి తన ఆలోచనకు పదును పెడితే ఇలాంటి సందర్భాలను ఇన్వెస్ట్‌మెంట్‌కు అనువుగా మలుచుకోవచ్చు. ఇందుకు ఏం చేయాలన్నది చూద్దాం...
 
 పొదుపు దిశగా....
 ఈ నెల 8వ తేదీ రాత్రి ప్రధానమంత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ అవి చెల్లుబాటు కావని, బ్యాంకుల్లో మార్చుకోవాలని లేదా ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. మరుసటి రోజు బ్యాంకులకు సెలవు. ఏటీఎంలు పనిచేయలేదు. ఆ తర్వాత కూడా ఎక్కువ శాతం ఏటీఎంలలో నగదు అందుబాటులోకి రాలేదు. దీంతో చేతిలో డబ్బుల్లేక, ఉన్న డబ్బులకు విలువ లేక ప్రతి ఒక్కరూ తమ ఖర్చులకు చెక్ పెట్టేశారు. ప్రతి రూపాయి ఖర్చుకూ లెక్కలేయడం ప్రారంభించారు. ఖర్చులను ఎలా తగ్గించుకోవచ్చో తాజా సందర్భం ప్రతీ ఒక్కరికీ నేర్పించింది. దీన్నే నిత్య జీవితంలో ఆచరణగా మార్చుకుంటే... పొదుపరులుగా మారిపోతారు. ఆ పొదుపును మంచి రాబడులను ఇచ్చే పథకాల్లోకి మళ్లించినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది. 
 
 కంటింజెన్సీ ప్లాన్
 అత్యవసరమైతే గట్టెక్కేందుకు సరిపడా నగదు ప్రతి ఒక్కరి వద్దా అందుబాటులో ఉండాలి. అనుకోని అవాంతరం వచ్చి నగదు ప్రవాహం ఆగిపోతే... అత్యవసరంగా నగదుతో అవసరం ఏర్పడితే... గట్టెక్కేందుకు సిద్ధంగా ఓ ఫండ్ ఉండాలి. కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని తక్షణమే నగదుగా మార్చుకునే సాధనాల్లో పెట్టుబడి పెట్టుకోవాలని నిపుణుల సలహా. ఇందుకోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌‌స అందించే లిక్విడ్ ఫండ్‌‌స అనువుగా ఉంటాయని వారు సూచిస్తున్నారు.
 
 మిక్స్‌డ్‌గా ఉండాలి
 ప్రతీ ఒక్కరి పోర్ట్‌ఫోలియో ఫిజికల్, ఫైనాన్‌‌స అసెట్స్ కలబోతగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఊహించని సందర్భాల్లో రాబడులను కోల్పోకుండా సరైన ఆసరాగా ఉంటుంది. ఉదాహరణకు రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడులను అవసరమైతే వెంటనే నగదుగా మార్చుకోవాలంటే దాదాపుగా అసాధ్యం. భూమిని నమ్మకున్నవారు ఎప్పు డూ నష్టపోరు అన్న సూత్రంతో తమ పొదుపునంతా రియల్టీ మార్కెట్‌పైనే పెట్టిన వారు అత్యవసర సమయాల్లో వాటిని ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పెట్టుబడులు ఎప్పుడూ కలబోతగా ఉండేలా చూసుకోవాలి. 
 
 డీమోనిటైజేషన్ అంటే..? డీమోనిటైజేషన్ అంటే
 చెలామణిలో ఉన్న నగదుకు చట్టబద్ధ చెల్లుబాటును రద్దు చేయడం. పాత నోట్లను అదే విలువ గల కొత్త కరెన్సీ నోట్లతో మార్పిడి చేయడం ఈ ప్రక్రియలో భాగం. స్వాతంత్య్రానంతరం 1978లోనూ ఓసారి
 డీమోనటైజేషన్ జరిగింది. నల్లధనం కట్టడికి అప్పట్లో చెలామణిలో ఉన్న రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దు చేశారు.
 
 పన్నుకు ప్లాన్ చేసుకోండి...
 నిజానికి పన్ను తప్పించుకునే వారి కంటే పన్ను చెల్లించే వారే తమ పెట్టుబడుల విషయంలో స్వేచ్ఛగా ఉండగలరు. చెల్లించాల్సినంత పన్ను చెల్లించేస్తే సంపాదనలో మిగులును ఆర్జన పరులు తమ రిస్క్‌కు తగిన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అలాగే, తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు దోహదపడే సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి. దీని కంటే ముందు పన్ను కట్టాల్సిన ఆదాయం ఉంటే పన్ను చెల్లించడమే మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ పన్ను ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేయవద్దు.
 
 పెట్టుబడులపై రాబడుల్లో మార్పులు
 ఇప్పటి వరకూ ఎక్కువ మంది లెక్కల్లో చూపని పన్ను ఆదాయాన్ని బంగారం, స్థలాలు, ఇళ్లు వంటి వాటిపై పెట్టుబడిగా పెట్టడం తెలిసిందే. నిధుల రాక ఎక్కువగా ఉండడం వల్ల ఈ సాధనాల్లో రాబడులు మంచిగానే ఉండేవి. కానీ, పన్ను ఎగ్గొట్టే అవకాశాలకు కేంద్రం కత్తెర వేస్తోంది. దీంతో భవిష్యత్తులో మరింత మంది ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్‌‌సలో పెట్టుబడి పెట్టే అవకాశాలున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఈక్విటీ మార్కెట్లు 5 శాతం పడిపోయాయిమిడ్, స్మాల్ క్యాప్ ఫండ్‌‌స విలువలు 7-8 శాతం వరకు, లార్జ్ క్యాప్ ఫండ్‌‌స 5 శాతం వరకు తగ్గాయిముఖ్యంగా రియల్ ఎస్టేట్ సూచీ 20 శాతం వరకు నష్టపోయి. మంచి స్టాక్స్‌లో, ఫండ్‌‌స పథకాల్లో పెట్టుబడులకు ఇదొక అవకాశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 
 
 ఆరోగ్య బీమా
 ఎప్పుడు, ఏ సమయంలో ఆస్పత్రి పాలవ్వాల్సి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇలాంటి సమయాల్లో వైద్య ఖర్చులు ఎంత అవుతాయో కూడా ఊహించడం కష్టమే. అందుకే ప్రతి ఒక్కరూ తమకు, తమ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య బీమా ఉండేట్టు చూసుకోవాలి. దీంతో నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే వైద్య సాయం పొందవచ్చు. ధన సాయం కోసం ఇతరుల వద్ద చేయిచాల్సిన పని పడదు. అత్యవసర నిధిని కూడా కదిలించే అవసరం కూడా రాకుండా ఉంటుంది.
 
 సొంతిల్లుకు సరైన తరుణం
 నోట్ల రద్దుతో రియల్టీ మార్కెట్లో లావాదేవీలు భారీగా పడిపోయాయిధనం రాక ఆగిపోవడంతో డిమాండ్ వాస్తవిక స్థాయికి చేరడం వల్ల ధరలు దిగివస్తాయన్నది పరిశీలకుల అంచనా. సొంతిల్లు సమకూర్చుకోవాలని అనుకునే వారు ప్రస్తుత తరుణంలో తక్కువ ధరకు డీల్ అందుబాటులో ఉంటే రుణంపై కొనుగోలు చేయడం సరైన నిర్ణయమే అవుతుంది. దాని వల్ల ఒకవైపు పన్ను ప్రయోజనం, మరోవైపు తక్కువ ధరకు సొంతిల్లు రెండు రకాలుగా లబ్ధి పొందవచ్చు. పైగా బ్యాంకుల్లోకి భారీగా వచ్చి చేరుతున్న నిధులతో సమీప కాలంలో రుణాలపై రేట్లు కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయిపన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే రుణంపై వడ్డీ కూడా సున్నాగా మారిపోతుంది.
 
 బంగారం బాండ్లు బెటరు
 పసిడిపై పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. నల్లధనం కట్టడి చేయడం వల్ల దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గనుంది. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే సమీప కాలంలో బంగారం ధర 10 గ్రాములు రూ.26 వేలకు పడిపోతుందని ఒక అంచనా. అయితేదే సమయంలో డాలర్‌తో రూపాయిరకం విలువ క్షీణించకుండా ఉంటేనే ఇది సాధ్యం అవుతుందని తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నేరుగా బంగారం కంటే ప్రభుత్వ బంగారం బాండ్లను కొనుగోలు చేయడం వల్ల 2.5-2.75 వరకు వడ్డీ లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. 
 
 వడ్డీ రేట్లు తగ్గితే...
 డీమోనిటైజేషన్ వల్ల వడ్డీ రేట్లు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుల ఆదాయం సైతం పెరుగుతుందంటున్నారు. అయితే నగదు కొరత కారణంగా ప్రజలు కనీస అవసరాలపైనే వినియోగం చేస్తారని, దాంతో నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల స్వల్ప కాలంలో వడ్డీ రేట్ల కోత అనుకున్న మేర ఉండకపోవచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఈ అభిప్రాయాల నేపథ్యంలో తక్కువ రిస్క్ కోరుకునే వారు లిక్విడ్, స్వల్ప కాలిక డెట్ ఫండ్‌‌సలో, రిస్క్ భరించే వారు దీర్ఘకాల ఫండ్‌‌స లో ఇన్వెస్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్‌‌స స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, దీర్ఘకాల బ్యాంకు డిపాజిట్లు, పన్ను రహిత బాండ్లు, కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయి
 

 

మరిన్ని వార్తలు