భారత్ రావడానికే పేరు మార్చుకున్నా: హెడ్లీ

8 Feb, 2016 11:06 IST|Sakshi
భారత్ రావడానికే పేరు మార్చుకున్నా: హెడ్లీ

ముంబై మహానగరంలో జరిగిన 26/11 మారణహోమం వెనుక పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా హస్తం ఉందన్న విషయం స్పష్టంగా తేలిపోయింది. తాను లష్కరే తాయిబాకు అసలైన అనుచరుడినని ముంబై పేలుళ్ల సూత్రధారి డేవిడ్ కాల్మన్ హెడ్లీ వెల్లడించాడు. కేవలం భారతదేశంలో ప్రవేశించడానికే తాను అమెరికన్‌లా పేరు మార్చుకున్నట్లు చెప్పాడు. తన అసలు పేరు దావూద్ గిలానీ అని.. ఆ పేరు ఉంటే రావడం కుదరదని పేరు మార్చుకున్నానని వీడియో లింకు ద్వారా హెడ్లీ సోమవారం ఉదయం ముంబైలోని ప్రత్యేక కోర్టు విచారణకు హాజరై.. ఈ వివరాలు వెల్లడించాడు. తన పేరు మార్చుకున్న తర్వాత ఆ సమాచారాన్ని లష్కరే తాయిబాకు చెందిన సాజిద్ మీర్‌కు చెప్పానన్నాడు. పేరు మార్చుకున్న కొన్ని వారాల తర్వాత పాకిస్థాన్ వెళ్లానని, భారతదేశంలో ప్రవేశించడానికి మాత్రమే పేరు మార్చానని చెప్పాడు.

భారతదేశంలో ఏదైనా వ్యాపారం లేదా ఆఫీసు పెట్టాలని సాజిద్ మీర్ తనకు చెప్పాడని, అతడి అసలు ఉద్దేశం ఏంటో.. తాను తొలిసారి భారతదేశం సందర్శించానికి కొద్ది ముందే చెప్పాడని హెడ్లీ తెలిపాడు. కొత్త పేరుతో తనకు పాస్‌పోర్టు వచ్చిన తర్వాత భారత దేశానికి 8 సార్లు వచ్చానని, అందులో 7 సార్లు ముంబై నగరంలోనే తిరిగానని అతడు అన్నాడు. ఒక్కసారి మాత్రమే తాను దుబాయ్ నుంచి భారత్ వెళ్లానని, మిగిలిన 7 సార్లూ నేరుగా పాకిస్థాన్ నుంచే వెళ్లానని వివరించాడు. తన వీసా దరఖాస్తులో తాను పుట్టిన ఊరు, తేదీ, తల్లి జాతీయత, తన పాస్‌పోర్టు నంబర్ తప్ప అన్నీ తప్పులేనని తెలిపాడు.

2015 డిసెంబర్‌లో హెడ్లీ ఈ కేసులో అప్రూవర్‌గా మారిపోయాడు. పేలుళ్లకు మొత్తం కుట్ర పన్నిందంతా లష్కరే తాయిబాయేనని, దానికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అనుమతి కూడా ఉందని హెడ్లీ అంటున్నాడు. ముంబైలో రెక్కీ చేయడానికి కూడా తనకు ఆర్థిక సహకారం అందించింది ఐఎస్ఐ సంస్థేనన్నాడు. తాను ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఇల్లు, ఇండియా గేట్, సీబీఐ కార్యాలయాల వద్ద కూడా రెక్కీ చేశానన్నాడు. కాగా.. డేవిడ్ హెడ్లీ తరఫున ప్రముఖ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదిస్తున్నారు.

మరిన్ని వార్తలు