ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర ప్రారంభం

21 Apr, 2015 20:16 IST|Sakshi

ఉత్తరాఖండ్లోని యమునోత్రి, గంగోత్రి ఆలయాల గేట్లు తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతీయ రోజునే ఈ యాత్రను ప్రారంభించాలని ముందుగా ముహూర్తం పెట్టారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఖర్సాలి ప్రాంతంలో పవిత్ర ఢోలీని స్వయంగా ఎత్తుకుని యమునోత్రికి వెళ్లి.. ఈ యాత్రను ప్రారంభించారు. గంగోత్రి గేట్లను మధ్యాహ్నం 12.30 గంటలకు తెరిచారు. యమునోత్రి గేట్లను మాత్రం అంతకంటే గంట ముందే, అంటే ఉదయం 11.30 గంటలకు తెరిచారు.


చార్ధామ్ యాత్రలోని మరో రెండు క్షేత్రాలైన కేదార్నాథ్ గేట్లను ఈనెల 24వ తేదీ ఉదయం 8.30 గంటలకు, బద్రీనాథ్ గేట్లను 26వ తేదీ ఉదయం 5.15 గంటలకు తెరుస్తారు. రెండేళ్ల క్రితం చార్ధామ్ యాత్ర సమయంలోనే ఉన్నట్టుండి వరదలు రావడంతో వేలాది మంది యాత్రికులు మరణించారు. ఆలయాలు కూడా కొట్టుకుపోయాయి. ఈసారి అలా భయపడాల్సిన ప్రమాదం ఏమీ లేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మరిన్ని వార్తలు