సిరియా ఘటనపై ఐరాస దిగ్ర్భాంతి

22 Aug, 2013 08:55 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి : సిరియాలో రసాయన ఆయుధాల వినియోగంపై తీవ్ర దిగ్భ్రాంతి చెందిన ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. నిన్న రాత్రి అత్యవసరంగా సమావేశమైంది. సిరియా పరిణామాలపై సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ షాక్‌కు గురయ్యారని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. సమితి రసాయన ఆయుధాల తనిఖీబృందం సిరియాలో ఉండగానే..డెమాస్కస్‌లో వాటి ప్రయోగం జరగడాన్ని సమితి సెక్రెటరీ జెనరల్‌ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన వెల్లడించారు.  

మరోవైపు సిరియాలో రసాయన ఆయుధాల ప్రయోగం జరిగిందన్న వార్తలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. అసాద్‌ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన అగ్రరాజ్యం, సిరియా విషయంలో తమతో విభేదించేవారు సైతం.. రసాయన ఆయుధాల ప్రయోగాన్ని గట్టిగా వ్యతిరేకించాల్సిందేనంది.  సిరియా పరిణామాలపై స్పందించిన అమెరికా విదేశాంగశాఖ, అధ్యక్ష భవనాలు వేర్వేరుగా ప్రకటనలు చేశాయి.

ఇక రాజధాని డమాస్కస్‌ పరిసరాల్లో జరిగిన ఈ దారుణ మారణకాండలో దాదాపు 1300 మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువమంది స్త్రీలు, చిన్నారులు ఉన్నారు. డమాస్కస్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో సైనిక బలగాలు విచక్షణ రహితంగా క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. విషపూరిత వాయువుల ప్రయోగం, క్షిపణి దాడులతో 1, 228 మంది బాధితులుగా మారారని వైద్యవర్గాలు తెలిపాయి.

అయితే రసాయనిక ఆయుధాల ప్రయోగం వార్తలను అధ్యక్ష వర్గాలు ఖండించాయి. ఎలాంటి విషపూరిత పదార్థాలు వినియోగించలేదని సైన్యం తెలిపింది.  సిరియాలో రసాయన ఆయుధాలు ఉన్నాయో లేవో తేల్చడానికి ఐరాస నిపుణుల బృందం ఆదివారం సినియాకు వచ్చిన నేపథ్యంలో ఈ దాడి ఉదంతం చోటుచేసుకోవటం గమనార్హం.

>
మరిన్ని వార్తలు