16కు చేరిన చెన్నై మృతుల సంఖ్య

30 Jun, 2014 13:07 IST|Sakshi

చెన్నై: చెన్నైలో 11 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. సోమవారం ఉదయానికి ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14 చేరుకోగా, మధ్యాహ్న సమయానికి 16 కు చేరుకుంది.  మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.

శనివారం సాయంత్రం నుంచి భారీగా సహాయ చర్యలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఆదివారం సాయంత్రానికి శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 26 మందిని ప్రాణాలతో వెలికి తీసి చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన చోటుచేసుకున్నప్పుడు 70 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకు పోయారు. వీరిలో ఎక్కువమంది మరణించి ఉంటారని ఆందోళన వ్యక్తమవుతోంది.  రాష్ట్రానికి చెందిన అధికారుల బృందం సేకరించిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు ఒడిశాలోని గజపతి జిల్లా నుంచి మొత్తం 48 మంది కార్మికులు ఈ భవనం వద్ద పనుల్లో ఉన్నారని.. వారిలో 10 మంది ప్రాణాలతో బయటపడగా మిగతా 48 మంది శిథిలాల్లో చిక్కుకుపోయారని తెలుస్తోంది.

 

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ముందు ప్రకటించిన రూ. 5 లక్షలను ఏడు లక్షలకు పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తెలిపారు. అంతకు ముందు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, గాయాలు ఏమీ లేకుండా బయటపడిన వారికి యాభై వేల పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు