తెర మీదకు మళ్లీ రచ్చ

19 May, 2017 09:48 IST|Sakshi
తెర మీదకు మళ్లీ రచ్చ

► నగ్మాతో ఝాన్సీ ఢీ

చెన్నై: రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ తెర మీదకు వచ్చింది. మహిళా నేతల మధ్య విభేదాలు వెలుగులోకి రావడంతో శనివారం జరగాల్సిన సమావేశాన్ని సైతం రద్దు చేయడం గమనార్హం. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. అనుబంధ విభాగంలోనూ ఈ గ్రూపుల గొడవ తరచూ వెలుగు చూడడం జరుగుతోంది. మహిళా కాంగ్రెస్‌లో గతంలో చోటు చేసుకున్న విభేదాలు పోలీసుస్టేషన్‌ వరకు సాగాయి. అప్పటి రాష్ట్రపార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ మద్దతుదారులు, మహిళా అధ్యక్షురాలు విజయధరణిల మధ్య ఈ వివాదం సాగింది.

 చివరకు విజయధరణి పదవి ఊడింది. కొత్త అధ్యక్షురాలుగా ఝాన్సీరాణి పగ్గాలు చేపట్టినా, ఆమెకు కూడా గ్రూపు సెగ తప్పలేదు. అస్సలు ఆమె నియామకాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఆందోళనే సాగింది. ఎట్టకేలకు అధిష్టానం మద్దతు ఝాన్సీకి దక్కడంతో గ్రూపులు వెనక్కు తగ్గాయి. ఝాన్సీ పగ్గాలు చేపట్టినానంతరం రాష్ట్ర విభాగం మీద జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ నగ్మా ప్రత్యేక దృష్టి పెట్టారు.

మహిళా వార్‌: ఝాన్సీ పెత్తనం కన్నా, నగ్మా వాయిస్‌ ఆ విభాగంలో పెరిగిందని చెప్పవచ్చు. దీంతో కొద్ది రోజులుగా నగ్మా చెన్నైకు వస్తున్న సమాచారంతో ఝాన్సీ డుమ్మా కొట్టే పనిలో పడ్డారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఝాన్సీ కుటుంబ వ్యవహారాలు మహిళా విభాగానికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టడం ఖాయం అన్న ఫిర్యాదులు ఢిల్లీకి పెరగడంతో గత వారం చెన్నైకు వచ్చిన నగ్మా విచారించే పనిలో పడ్డట్టు సమాచారం. నగ్మా ప్రశ్నలకు ఝాన్సీ సమాధానాలు దాటవేసినట్టు, తన మీద పెత్తనం ఏమిటో అన్నట్టుగా ఆమె అసహనం వ్యక్తం చేసినట్టు మహిళా కాంగ్రెస్‌లో చర్చ సాగుతోంది.

 నగ్మా రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమైనా, అందుకు ఝాన్సీ నుంచి సహకారం కరువుతో ఈ ఇద్దరి మధ్య వివాదం ముదిరినట్టు అయింది. తమిళనాడు మీద నగ్మా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో మహిళా విభాగం అధ్యక్షురాలి నుంచి సహకారం కొరవడడం ఆ విభాగంలోని విభేదాలను మళ్లీ తెర మీదకు తెచ్చాయి. ఎవరికి వారు అధిష్టానంకు ఫిర్యాదులు హోరెత్తించుకునే పనిలో పడడంతో, మరి కొద్ది రోజుల్లో మళ్లీ ఆ విభాగం అధ్యక్షురాలు మార్పు అనివార్యం అయ్యేనా..? అన్న ప్రశ్న తలెత్తింది.

ఈ వివాదాల పుణ్యమా శనివారం సత్యమూర్తి భవన్‌వేదికగా జరగాల్సిన మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం అర్ధాంతరంగా రద్దు కావడం గమనార్హం. అస్సలే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలం అంతంత మాత్రంగా ఉన్న సమయంలో పార్టీలోనే కాదు, మహిళల్లోనూ విభేదాలు రచ్చకెక్కడం ఏఐసీసీ పెద్దలకు శిరోభారంగా మారింది. నగ్మా పెత్తనం పెరగడమో లేదా, మరేదైనా కారణాలో ఏమోగానీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి నటి కుష్బూ సైతం పార్టీ వ్యవహారాల్లో  అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం గమనించాల్సిన విషయం.

 

>
మరిన్ని వార్తలు