ఛోటా రాజన్‌కు మరో ఎదురు దెబ్బ

24 Apr, 2017 16:23 IST|Sakshi
ఛోటా రాజన్‌కు మరో ఎదురు దెబ్బ

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్‌ ఛోటా రాజన్‌కు మరో ఎదురుదెబ్బ తగలింది. నకిలీ పాస్‌ పోర్టు కేసులో సోమవారం ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఛోటా రాజన్‌ను దోషీగా ప్రకటించింది. రేపు (మంగళవారం) రాజన్‌కు శిక్షను ఖరారు చేయనున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ కుమార్‌ గోయల్‌ ప్రకటించారు.

ఫోర్జరీ పత్రాలతో మారుపేరుతో ఛోటా రాజన్‌ పాస్‌ పోర్టు పొందినట్టు గతేడాది జూన్‌ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. రాజన్‌తో పాటు పాస్‌ పోర్టు అధికారులు జయశ్రీ దత్తాత్రేయ్‌ రహతె, దీపక్‌ నట్వర్‌లాల్‌ షా, లలిత లక్ష్మణన్‌లపై కేసు నమోదైంది. 1998-99లో బెంగళూరులో ఛోటా రాజన్‌.. మోహన్‌ కుమార్‌ అనే పేరుతో నకిలీ పాస్‌ పోర్టు పొందాడని, ఇందుకు పాస్ట్‌ పోర్టు అధికారులు సహకరించారని సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. నేరం రుజువు కావడంతో రాజన్‌తో పాటు అతనికి సహకరించిన వారిని కోర్టులో దోషులుగా ప్రకటించింది.

హత్యలు, స్మగ్లింగ్‌, కిడ్నాప్‌ సహా రాజన్‌పై 85కు పైగా కేసులున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లతో అతనిపై దాఖలైన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2015 అక్టోబర్‌లో ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డ రాజన్‌ను ఆ ఏడాది నవంబర్‌లో భారత్‌కు అప్పగించారు.

>
మరిన్ని వార్తలు